మోడీ ప్రమాణ స్వీకారంలోనూ దౌత్యానికి పెద్దపీట...పాక్ ను...

Update: 2019-05-29 09:45 GMT

భారత ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం అంటే సాధారణ కార్యక్రమం ఏమీ కాదు దేశ భవిష్యత్తు దౌత్య కార్యాచరణను కూడా అది సూచిస్తుంది. అందుకే అదెంతో ప్రాధాన్యం సంతరించకుంది. ఒక దేశాన్ని ఆహ్వానించినా మరో దేశాన్ని ఆహ్వానించకపోయినా అదెంతో ముఖ్యమైన వార్తనే అవుతుంది. 2014లో ప్రమాణ స్వీకారోత్సవానికి అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను ఆహ్వానించిన మోడీ ఈసారి మాత్రం పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను విస్మరించారు. ఈ నేపథ్యంలో పాక్ ప్రధానిని ఎందుకు ఆహ్వానించలేదు? ఇకపై పాక్ తో భారత్ సంబంధాలు ఎలా ఉండనున్నాయి? దక్షిణాసియా దేశాల వేదిక అయిన సార్క్ కథ ఇక ముగిసిపోయినట్లేనా ? దాని స్థానంలో బిమ్స్ టెక్ దేశాలకే భారత్ ప్రాధాన్యం ఇవ్వనుందా ? భారత్ ఏయే దేశాలకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వనుంది

నరేంద్ర మోడీ తొలిసారిగా ప్రధానిగా ప్రమాణం చేసే కార్యక్రమానికి పాకిస్థాన్ నాటి ప్రధాని నవాజ్ షరీఫ్ హాజరయ్యారు. రెండో విడత ప్రమాణ స్వీకారోత్సవానికి మాత్రం పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఆహ్వానం అందలేదు. భారత్ పొరుగు దేశాల్లో అత్యంత ముఖ్యమైంది పాకిస్థాన్. మరి అలాంటి దేశ ప్రధానికి ఆహ్వానం అందలేదంటే ఆ దేశంపై భారత్ అనుసరించబోయే దౌత్య విధానానికి అది అద్దం పడుతుంది.

భారత ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి పొరుగు దేశాల ప్రతినిధులంతా హాజరు కానున్నారు ఒక్క పాకిస్థాన్ మినహా. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను ఆహ్వానించకపోవడం సంచలనం కలిగించింది. పాక్ ను విస్మరించడం ద్వారా మోడీ ఒక కీలక రాజకీయ ప్రకటన చేసినట్లయింది. ఐదేళ్ళ క్రితం ఇదే సందర్భం అప్పుడు మోడీ పాక్ నాటి ప్రధాని నవాజ్ షరీఫ్ ను ఆహ్వానించడం ద్వారా పాకిస్థాన్ కు స్నేహహస్తం చాచారు. ఇప్పుడు మాత్రం ఉగ్రవాదంతో రక్తసిక్తమైన పాక్ హస్తాన్ని అందుకునేందుకు మోడీ ఇష్టపడడం లేదు. మోడీ మొదటి సారి ప్రధాని అయినప్పుడు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను ఆహ్వానించడం కూడా పెద్ద వివాదంగా మారింది. అందుకు కారణం పాక్ పై కఠిన వైఖరి అవలంబిస్తామని మోడీ తన ఎన్నికల ప్రచారంలో స్పష్టం చేశారు. అలాంటి మోడీ నాటి పాక్ ప్రధానిని ఆహ్వానించడం బీజేపీ లో కొంత మంది నాయకులకు ఇష్టం లేకపోయింది. కొన్ని మిత్ర పక్షాలకు కూడా అది మింగుడు పడలేదు. వాటిని పట్టించుకోకుండా మోడీ పాకిస్థాన్ కు స్నేహహస్తం చాచారు. తదనంతర కాలంలో పాకిస్థాన్ మాత్రం భారత్ పట్ల ద్వేషపూరిత ధోరణి అనుసరించింది. శాంతి వచనాలు వల్లించే ఇమ్రాన్ ఖాన్ ప్రధాని అయిన తరువాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. పాక్ ప్రభుత్వ ప్రోత్సాహంతోనే భారత్ లో ఉగ్రవాదుల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. గురుదాస్ పూర్, పఠాన్ కోట్ ఉగ్రదాడులు, బుర్హాన్ ఎన్ కౌంటర్ అనంతర హింసాకాండ, యురి దాడులు లాంటివన్నీ కూడా పాకిస్థాన్ తో భారత్ స్నేహపూర్వకంగా మెలిగే అవకాశం లేకుండా చేశాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ పట్ల మరోసారి నిరసన వ్యక్తం చేసేందుకు తాజాగా మోడీ ప్రమాణ స్వీకారోత్సవం ఒక సందర్భంగా మారింది. పాక్ తో దెబ్బ తిన్న సంబంధాలకు ఇది ఒక సంకేతంగా నిలిచింది. భవిష్యత్తులో పాక్ పట్ల అనుసరించబోయే కఠిన వైఖరికి సూచనగా మారింది.

ఒక ముఖ్యమైన కార్యక్రమానికి ఆహ్వానించకపోవడం ద్వారా పాకిస్థాన్ పై భారత్ ఈ విధంగా ఆగ్రహం వ్యక్తం చేయడం ఇదే తొలిసారి కాదు. గత రెండు, మూడేళ్ళ క్రితమే అందుకు బీజం పడింది. మరీ ముఖ్యంగా 2016లో పాకిస్థాన్ లో జరగాల్సిన సార్క్ సదస్సును భారత్ తన దౌత్యవ్యూహంతో రద్దు చేయించగలిగింది. ఇక నాటి నుంచి కూడా పాకిస్థాన్ సభ్యదేశంగా ఉన్న సార్క్ కు భారత్ ప్రాధాన్యం ఇవ్వడం మానేసింది. పాకిస్థాన్ కు సభ్యత్వం లేని ఇతర వేదికలకు, ఆ వేదికల్లోని దేశాలకు ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టింది. తాజా గా మోడీ ప్రమాణ స్వీకారోత్సవం మరోసారి అందుకు వేదికగా మారింది. మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి అతిథులను ఆహ్వానించడం భారత్ ఈ దఫా బిమ్స్ టెక్ దేశాలకు ప్రాధాన్యం ఇచ్చింది. బే ఆఫ్ బెంగాల్ ఇన్షియేటివ్ ఫర్ మల్టీ-సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కో-ఆపరేషన్ ఒక్క ముక్కలో చెప్పాలంటే బిమ్స్ టెక్ ఇప్పుడు భారతదేశానికి అత్యంత ప్రాధన్య వేదికగా మారింది. ఆ దేశాల అధిపతులు మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, థాయ్ లాండ్, నేపాల్, భూటాన్ దేశాలు బిమ్స్ టెక్ లో సభ్యదేశాలుగా ఉన్నాయి. వాటితో పాటుగా కిర్గిస్థాన్, మారిషస్ దేశాధినేతలను కూడా మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు. ఆయా దేశాలకు భారత్ ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఇది సూచిస్తోంది.

ఇక్కడ గమనించాల్సిన అంశం మరొకటి కూడా ఉంది. బిమ్స్ టెక్ దేశాలన్నీ కూడా బీజేపీ అనుసరించే కీలక విదేశాంగ విధానాలతో మమేకమయ్యే విధంగానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా నైబర్ హుడ్ ఫస్ట్ పాలసీ, యాక్ట్ ఈస్ట్ పాలసీ అనేవి బిమ్స్ టెక్ దేశాలతో స్నేహసంబంధాలను మెరుగుపరుచుకునేవిగా ఉన్నాయి. కీలక దక్షిణాసియా దేశాల నుంచి పాకిస్థాన్ ను విడదీసేందుకు భారత్ కు కలసి వచ్చిన ఒక అవకాశం బిమ్స్ టెక్. 1997లో మొదట ఇది బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయ్ లాండ్ సభ్యదేశాలుగా ఏర్పడింది. 1997లో మయన్మార్ ఇందులో చేరింది. 2004లో నేపాల్, భూటాన్ కూడా ఇందులో చేరాయి. గత ఆగస్టులో ఖాట్మండులో జరిగిన బిమ్స్ టెక్ సదస్సులో మోడీ మాట్లాడుతూ భారత్ కు బిమ్స్ టెక్ దేశాలు ఎంత కీలకమో వివరించారు. నైబర్ హుడ్ ఫస్ట్, యాక్ట్ ఈస్ట్ గురించి మోడీ ఆ సందర్భంగా ప్రస్తావించారు. భారతదేశ నేషనల్ నాలెడ్జ్ నెట్ వర్క్ ను శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన‌, నేపాల్, మయన్మార్, థాయ్ లాండ్ లతో పంచుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. గత సెప్టెంబర్ లో బిమ్స్ టెక్ దేశాలతో కలసి భారత్ మొదటిసారిగా సైనిక విన్యాసాలను కూడా నిర్వహించింది. టెర్రరిస్టు వ్యతిరేక చర్యలను నిర్వహించడం పై ఇందులో ప్రధానంగా దృష్టి సారించారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే దక్షిణాసియాలో పాకిస్థాన్ ను ఒంటరి చేసే వ్యూహాన్ని భారత్ దిగ్విజయంగా అమలు చేసింది. ఇతర ఆసియా దేశాలకూ ఆ వ్యూహాన్ని విస్తరించనుంది. ఇక మిగిలింది సార్క్ ను నామమాత్రం చేయడమే. బిమ్స్ టెక్ కు ప్రాధాన్యం పెరిగితే ఇక భారత్ కు సార్క్ అవసరమే ఉండదు.

సుమారు 34 ఏళ్ళ క్రితం 1985 డిసెంబర్ 8 న సార్క్ ఆవిర్భవించింది. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కో-ఆపరేషన్ పేరిట ఈ వేదిక రూపుదిద్దుకుంది. ఆప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్, మాల్దీవ్స్, పాకిస్థాన్, నేపాల్ మొత్తం 8 దేశాలు ఇందులో సభ్యదేశాలుగా ఉన్నాయి. సార్క్ ఆరంభం నుంచి సజావుగా సాగిన సమావేశాలకు మొదటిసారిగా 2016 నవంబర్ లో విఘాతం కలిగింది. పాకిస్థాన్ లో జరగాల్సిన ఆ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లుగా భారత్ ప్రకటించింది. బంగ్లాదేశ్, భూటాన్, ఆప్ఘనిస్థాన్ కూడా భారత్ కు అండగా నిలిచాయి. చివరకు ఆ సమావేశం రద్దయింది. బిమ్స్ టెక్ కు ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో బహుశా సార్క్ కథ కంచికి చేరిందని కూడా అనిపిస్తోంది.

బిమ్స్ టెక్ పేరు లోన బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళా ఖాతం ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా బంగాళాఖాతం క్రమంగా ప్రాధాన్యం సంతరించుకుంటున్నది. దాని చుట్టూరా ఏడు దేశాలున్నాయి. వాటిలో మొత్తం ప్రపంచ జనాభాలో 22 శాతం మంది నివసిస్తున్నారు. చిన్న పాటి సమస్యలు ఉన్నప్పటికీ ఈ ఏడు దేశాల కూడా సగటు వార్షిక వృద్ధి రేటు 3.4 శాతం నుంచి 7.5 శాతం దాకా ఉంది. ఏటా ప్రపంచంలో నాలుగో వంతు వ్యాపారం బంగాళాఖాతం గుండానే జరుగుతోంది. అన్నిటి కంటే ముఖ్యమైన విషయం ఇవన్నీ భారతదేశానికి పొరుగునే ఉన్నాయి. రేపటి నాడు భారతదేశానికి ఉగ్రవాదం ఎగుమతి కాకుండా ఉండడంలో ఇవే కీలకపాత్ర పోషించనున్నాయి. అందుకే ప్రధాని మోడీ బిమ్స్ టెక్ దేశాలకు అమిత ప్రాధాన్యం ఇచ్చారు.

బిమ్స్ టెక్ కు ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో సార్క్ కథ కంచికి చేరినట్లుగానే కనిపిస్తోంది. ఇక ముందు కూడా సార్క్ ను కొనసాగించడం పాకిస్థాన్ రాజకీయ ప్రయోజనాలకు మేలు చేకూర్చడమే అవుతుంది. మాల్దీవులు, ఆప్ఘనిస్థాన్, పాకిస్థాన్ మినహా మిగిలిన దేశాలన్నీ కూడా బిమ్స్ టెక్ లో ఉన్నాయి. మాల్దీవులు, ఆఫ్ఘనిస్థాన్ లతో భారత్ కు దౌత్య సంబంధాలు బాగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ను ఒంటరి చేసేందుకు ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఒక చక్కటి వేదికగా నిలిచింది. బిమ్స్ టెక్ దేశాలతో మిళితమయ్యేందుకు ఒక మంచి సందర్భాన్ని అది భారత్ కు అందించింది.

Full View  

Similar News