5 Star Rating: ఈ హ్యుందాయ్ టక్సన్‌కు 5 స్టార్ రేటింగ్.. తొలి కారు ఇదే!
Hyundai Tucson Bharat NCAP: దక్షిణ కొరియాకు చెందిన ఆటో దిగ్గజం 'హ్యుందాయ్'కు చెందిన కారు భారత్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించింది.
Hyundai Tucson Bharat NCAP: దక్షిణ కొరియాకు చెందిన ఆటో దిగ్గజం 'హ్యుందాయ్'కు చెందిన కారు భారత్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించింది. హ్యుందాయ్‌కి చెందిన ఎస్‌యూవీ 'టక్సన్' 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది. భారత్ ఎన్‌క్యాప్ రేటింగ్స్‌లో అత్యధిక రేటింగ్ సాధించిన తొలి హ్యుందాయ్ కారు కూడా ఇదే. మోస్ట్ పాపులర్ కారు 'హ్యుందాయ్ వెర్నా' గతంలో గ్లోబల్ ఎన్‌క్యాప్ టెస్ట్‌లో ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించింది.
హ్యుందాయ్ టక్సన్ కారు పెద్దల భద్రతకు సంబంధించి 32 పాయింట్లకు గాను.. 30.84 సేఫ్టీ పాయింట్లు సాధించినట్లు భారత్ ఎన్‌క్యాప్ ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు పిల్లల భద్రతకు సంబంధించి 49 పాయింట్లకు గాను.. 41 పాయింట్లు స్కోర్ చేసింది. ఈ రెండు కేటగిరీల్లోనూ హ్యుందాయ్ టక్సన్ 5 స్టార్ రేటింగ్ సాధించినట్లు పేర్కొంది. పెద్దల, పిల్లల భద్రతకు సంబంధించి.. టక్సన్ కారు 5 స్టార్ రేటింగ్ సాధించినట్లు వెల్లడించింది. టక్సన్‌లో ఫ్రంటల్ ఎయిర్‌బ్యాగ్, బెల్ట్ ప్రిటెన్షనర్, బెల్ట్ లోడ్ లిమిటర్, సైడ్ హెడ్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్, సైడ్ చెస్ట్ ఎయిర్‌బ్యాగ్, సైడ్ పెల్విస్ ఎయిర్‌బ్యాగ్ ఉంటాయి. అదనంగా పిల్లల సీట్ల కోసం మౌంట్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, సీట్ బెల్ట్ రిమైండర్‌లు ఉన్నాయి.
హ్యుందాయ్ టక్సన్ కారు ధర భారత్ మార్కెట్‌లో రూ.29.02 లక్షల నుంచి రూ.35.94 లక్షల మధ్య ఉంది. ఇది పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో అందుబాటులో ఉంది. ఈ కారు 12.95 నుంచి 15.38 కిమీ మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. టక్సన్ 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్, 2-లీటర్ డీజిల్ ఇంజన్ వేరియంట్లలో ఉంది. టక్సన్ కారు వోక్స్‌వ్యాగన్ టైగూన్, స్కోడా కొడియాక్, టయోటా ఫార్చ్యూనర్, నిస్సాన్ ఎక్స్-ట్రైల్‌లకు గట్టి పోటీ ఇస్తోంది. భారత్ ఎన్‌క్యాప్ రేటింగ్‌లో ఇప్పటికే మహీంద్రా థార్ రాక్స్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ, మహీంద్రా ఎక్స్‌యూవీ 400లు 5 స్టార్ రేటింగ్ సాధించాయి. టాటా కర్వ్, టాటా కర్వ్ ఈవీ, టాటా నెక్సాన్ కూడా ఫైవ్ స్టార్ రేటింగ్ పొందాయి.