Car Recall: 2 లక్షల కార్లను రీకాల్ చేసిన కంపెనీలు.. సమస్య ఏంటో తెలుసా.?
Car Recall: కార్ల తయారీలో సమస్యలు బయటపడడం సర్వసాధారణమైన విషయం తెలిసిందే.
Car Recall: కార్ల తయారీలో సమస్యలు బయటపడడం సర్వసాధారణమైన విషయం తెలిసిందే. అయితే అవి మార్కెట్లోకి వచ్చిన తర్వాత సమస్యలు వెలుగులోకి వస్తే కంపెనీలు రీకాల్ చస్తుంటాయి. అందులో సమస్యలను పరిష్కరించి మళ్లీ కొత్త కార్లను అందిస్తుంటాయి. ఇప్పటి వరకు చాలా కంపెనీలు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి ప్రముఖ ఆటో మొబైల్ సంస్థలు హ్యుందాయ్, కియా కూడా వచ్చి చేరాయి.
తాజాగా ఈ కంపెనీలు తమ సంస్థకు చెందిన ఏకంగా 2,08,000 ఎలక్ట్రిక్ వాహనాలను రీకాల్ చేశాయి. అయితే ఇది అమెరికాలో జరిగింది. ఇంత పెద్ద ఎత్తున కార్లను రీకాల్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోన్న తరుణంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఊహించని విధంగా వాహనాలు.. పవర్ కెపాసిటీ కోల్పోతున్నాయనే సమస్యతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. సమస్య ఇంటిగ్రేటెడ్ ఛార్జింగ్ కంట్రోల్ యూనిట్ (ICCU)లో ఉంది. ఇది పాడైపోయి 12-వోల్ట్ బ్యాటరీని ఛార్జ్ చేయడం ఆపేయవచ్చు. ఈ లోపంతో డ్రైవ్ పవర్ కోల్పోయి, కార్ క్రాష్ అయ్యే ప్రమాదాన్ని పెంచుతుందని సంస్థలు చెబుతున్నాయి.
సాధారణంగా ఇంటిగ్రేటెడ్ ఛార్జింగ్ కంట్రోల్ యూనిట్ విఫలమైనప్పుడు, డ్రైవర్లు వరుసగా వార్నింగ్స్ అందుకుంటారు. వెహికల్ ఫెయిల్-సేఫ్ డ్రైవింగ్ మోడ్‌కు మారుతుంది. ఈ మోడ్ క్రమంగా 20 నుంచి 40 నిమిషాలకు పైగా డ్రైవ్ పవర్‌ను తగ్గిస్తుంది. డ్రైవర్లు రెస్పాండ్ అవ్వడానికి కొంత సమయం మాత్రమే ఇస్తుంది. ఈ కారణంగానే హ్యుందాయ్ 1,45,000కిపైగా అయోనిక్ , జెనెసిస్ మోడల్స్‌ను రీకాల్ చేసింది.
ఇక కియో మోటార్స్ విషయానికొస్తే.. 62,872 కియా EV6 మోడళ్లను రీకాల్ చేస్తోంది. డీలర్లు ఈ సమస్యకు ఫ్రీ సర్వీసు అందిస్తారు. ఇందులో భాగంగానే ఉచితంగా.. ఇంటిగ్రేటెడ్ ఛార్జింగ్ కంట్రోల్ యూనిట్, దాని ఫ్యూజ్‌ను చెక్ చేసి రీప్లేస్ చేస్తున్నారు. అలాగే ఇంటిగ్రేటెడ్ ఛార్జింగ్ కంట్రోల్ యూనిట్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేస్తున్నారు. డ్రైవ్ పవర్ కోల్పోవడం ప్రమాదాల రిస్కును భారీగా పెంచుతుందని యూఎస్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరించిన నేపథ్యంలో రీకాల్ నోటిఫికేషన్ జారీ చేశారు.