Lagcherla Attack: పట్నం నరేందర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట
Vikarabad Attack: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో శుక్రవారం ఊరట లభించింది.
Vikarabad Attack: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో శుక్రవారం ఊరట లభించింది. లగచర్ల ఘటనలో ఆయనపై నమోదు చేసిన మూడు ఎఫ్ఐఆర్ లలో రెండింటిని హైకోర్టు కొట్టివేసింది. లగచర్ల ఘటనలో తనపై బొంరాస్ పేట పోలీస్ స్టేషన్ లో మూడు ఎఫ్ఐఆర్ లు నమోదు చేయడాన్ని ఆయన హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు శుక్రవారం నాడు తీర్పును వెల్లడించింది.
దుద్యాల మండలంలో ఫార్మా క్లస్టర్ ఏర్పాటును నిరసిస్తూ లగచర్లకు వచ్చిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సహా ఇతర అధికారులపై గ్రామస్తులు ఈ నెల 11న దాడికి యత్నించారు. ఈ ఘటనలో కలెక్టర్ సహా ఇతర అధికారులను పోలీసులు రక్షించారు. కడా అధికారి వెంకట్ రెడ్డిపై గ్రామస్తులు దాడి చేశారు.ఈ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన డీఎస్పీ సహా ఇతర అధికారులపై గ్రామస్తులు దాడి చేశారు. ఈ ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో ఏ 1 నిందితుడిగా బి. సురేశ్ ను పోలీసులు గుర్తించారు.
లగచర్ల ఘటన రాజకీయ రంగు పులుముకుంది. కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా క్లస్టర్ ఏర్పాటు కోసం గిరిజన రైతుల భూములను లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. ఎకరానికి రూ. 50 నుంచి 60 లక్షలు ధర పలికే భూములకు కేవలం రూ. 10 లక్షలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ఫార్మా కంపెనీలకు భూములు ఇచ్చేందుకు గిరిజన రైతులు ముందుకు రావడం లేదు.