పార్టీ ఫిరాయింపులతో బక్కచిక్కిన తెలంగాణ కాంగ్రెస్‌కు ఊపిరి పోశారు ఆ ముగ్గురు. లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయం అని కాలర్ ఎగరేశారు. మరి ఆ ముగ్గురు మూకుమ్మడిగా పనిచేస్తారా..? రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేస్తారా..? తెలంగాణ కాంగ్రెస్ ముగ్గురు ఎంపీల తీరుపై హెచ్‌ఎంటీవీ ప్రత్యేక కథనం.
ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ మూడు స్థానాల్లో విజయం సాధించింది. నల్లగొండ నుంచి పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మల్కాజ్‌గిరి నుంచి రేవంత్‌రెడ్డి టీఆర్ఎస్‌కు గట్టి షాక్ ఇచ్చి విన్నింగ్ షాట్ కొట్టారు. అయితే పార్టీలో ఈ ముగ్గురూ ముగ్గురే. ఎవ్వరినీ తక్కువ అంచనా వేయలేం. ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. ఒకరు ఫైర్ బ్రాండ్ అయితే మరొకరికి దూకుడెక్కువ. ఎవరూ ఎందులో తక్కువ కాదనుకునే రకం. ఎవరి మాట వినరని చెబుతారు. మిగతావారిని పట్టించుకోరని ఎవరి ఆధిపత్యం కోసం వారు ప్రయత్నిస్తూనే ఉంటారనే వాదన ఉంది. పార్టీలో పట్టు నిలుపుకునేందుకు కూడా ప్రత్యేక వ్యూహాలు అమలు చేస్తారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
ముఖ్యంగా నాలుగేళ్లుగా టీపీసీసీ చీఫ్‌గా ఉన్న ఉత్తమ్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటారనే విమర్శ పార్టీలో వ్యక్తమవుతాయి. స్వతంత్య్రంగా వ్యవహరించే ఉత్తమ్‌కు పార్టీ హైకమాండ్‌లో మంచి పట్టుందని చెబుతారు. అందుకే ఉత్తమ్ ఏం చేసినా నడుస్తుందనే విమర్శ కూడ పార్టీలో వినిపిస్తుంది. ఇక కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిది డిఫ్‌రెంట్ స్టైల్. కోపం వస్తే సొంత పార్టీ నాయకులనే కడిగిపారేస్తారు. అలాగే పార్టీలో తనకంటే సీనియర్ ఎవరు లేరని పీసీసీగా తనకు అవకాశం ఇవ్వాలని కొన్నేళ్లుగా కోరుతున్నారు. కానీ కోమటిరెడ్డి ఎప్పుడు ఎలా స్పందిస్తారో తెలియదనే చర్చ పార్టీలో నడుస్తుంది.
ఇక ఫైర్‌బ్రాండ్ రేవంత్ రెడ్డి పార్టీలో చేరేముందే హై కమాండ్ నుంచి అన్నిరకాల హామీలు తీసుకొని వచ్చారని చెబుతారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా ఎంపీగా గెలవడంతో రాష్ట్ర పార్టీలో తనదైన ముద్ర వేసేందుకు పావులు కదుపుతున్నారు. పీసీసీపై ఇంట్రెస్ట్ ఉన్న రేవంత్ అవకాశం ఇస్తే సత్తా చాటేందుకు సిద్ధమనే సంకేతాలు కూడా తన సన్నిహితుల ద్వారా ఇస్తున్నారని తెలుస్తోంది.
ఇలా ఎవరూ ఎవరికి తక్కువ కాని ఈ ముగ్గురు కలిసి పనిచేస్తారా..? పార్టీని బలోపేతం చేస్తారా..? అన్నదే అనుమానంగా మారింది. పార్టీలో తమదైన ముద్ర వేసేందుకు ఉవ్వీళ్లూరుతున్న ఈ ముగ్గురి ఆధ్వర్యంలో పార్టీ ఎలా ముందుకు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది.