December Deadlines: డిసెంబర్‌లోని ఈ డెడ్‌లైన్ గుర్తున్నాయా?.. డబ్బులు వృధా చేసుకోకండి!
2024 December Deadlines: డిసెంబర్ మాసం కొన్ని ఆర్థిక సంబంధిత వ్యవహారాలకూ డెడ్‌లైన్. ఫ్రీ ఆధార్ అప్‌డేట్, స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ)ల గడువులు ఈ నెలలోనే ముగియనున్నాయి.
2024 December Deadlines: మరో రెండు రోజుల్లో డిసెంబర్ మాసం వస్తోంది. డిసెంబర్ అనగానే అందరికీ మొదటగా గుర్తుకొచ్చేది 'న్యూ ఇయర్' మాత్రమే. కానీ ఈ నెలలో చాలా డెడ్‌లైన్‌లు ఉంటాయి. డిసెంబర్ మాసం కొన్ని ఆర్థిక సంబంధిత వ్యవహారాలకూ డెడ్‌లైన్. ఫ్రీ ఆధార్ అప్‌డేట్, స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ)ల గడువులు ఈ నెలలోనే ముగియనున్నాయి. క్రెడిట్ కార్డులకు సంబంధించిన కొన్ని మార్పులు కూడా రానున్నాయి. అంతేకాదు బిలేటెడ్ రిటర్నులకు డెడ్‌లైన్ ఉంటుంది. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి తెలుసుకుందాం.
ఎఫ్‌డీ డెడ్‌లైన్
ఐడీబీఐ బ్యాంక్ 'ఉత్సవ్ స్పెషల్ డిపాజిట్' స్కీమ్ గడువు డిసెంబర్ 31తో ముగియనుంది. ఇందులో 300 రోజులు, 375 రోజులు, 444 రోజులు, 700 రోజుల గడువు ఎఫ్‌డీలను బ్యాంక్ అందిస్తోంది. ఈ ఎఫ్‌డీలపై వరుసగా 7.05%, 7.25%, 7.35%, 7.20% శాతం వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు అయితే 50 బేసిస్ పాయింట్ల అదనంగా వస్తాయి. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్స్ సైతం డిసెంబర్ 31తో ముగియనున్నాయి. 222 రోజులు, 333 రోజులు, 444 రోజులు, 555 రోజులు, 777 రోజులు, 999 రోజుల ఎఫ్‌డీలు ఉండగా.. వరుసగా 6.30%, 7.20%, 7.30%, 7.45%, 7.25%, 6.65% చొప్పున వడ్డీని బ్యాంక్ ఆఫర్ చేస్తోంది. ఎఫ్‌డీ చేసుకోవాలనుకునే వారు గడువులోగా చేసుకుంటే బెటర్.
ఫ్రీ ఆధార్ అప్‌డేట్
ఆధార్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు కేంద్రప్రభుత్వం ఇచ్చిన గడువు డిసెంబర్ 14. మరో రెండు వారాల్లో ఆ గడువు ముగియనుంది. ఈలోగా ఆధార్ కార్డులో చిరునామా, మొబైల్ నంబర్, పుట్టిన తేదీ లాంటి మార్పులు చేసుకోవాలనుకొనే వారు ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఒకవేళ గడువు పూర్తయిన తర్వాత మార్పులు చేసుకుంటే.. ఆధార్ సెంటర్లో రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.
క్రెడిట్ కార్డు ఛేంజెస్
యాక్సిస్ బ్యాంక్ కొన్ని క్రెడిట్ కార్డులపై ఫైనాన్స్ ఛార్జీలను పెంచిన విషయం తెలిసిందే. 3.6 శాతం నుంచి 3.75 శాతానికి పెంచింది. రెంటల్ పేమెంట్‌పై 1 శాతం ఫీజును, రూ.10వేల పైన చేసే వాలెట్ లోడింగ్‌లపైన 1 శాతం ఫీజు వసూలు చేయనుంది. ఈ పెరుగుదల డిసెంబర్ 20 నుంచి అమల్లోకి వస్తాయి. ఇక్సిగో ఏయూ క్రెడిట్ కార్డుకు సంబంధించి మార్పులు డిసెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి.
బిలేటెడ్ రిటర్నులు
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24) సంబంధించి రిటర్నులు ఎవరైనా దాఖలు చేయకుంటే.. మరో అవకాశం ఉంది. అయితే పెనాల్టీ చెల్లించి రిటర్నులు దాఖలు చేసుకోవాలి. ఇందుకు చివరి గడువు డిసెంబర్ 31.