తిరుపతిలో కిడ్నాపర్‌ను గుర్తించిన పోలీసులు
తిరుపతిలో నిన్న బాలుడిని అపహరించిన కిడ్నాపర్ ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. తిరుపతి రైల్వేస్టేషన్‌లో టిక్కెట్టు కౌంటర్ వద్ద బాలుడితో కలిసి ఉన్నట్టు సీసీ టీవీ కెమెరాలో దృశ్యాలు రికార్డయ్యాయి.
తిరుపతిలో నిన్న బాలుడిని అపహరించిన కిడ్నాపర్ ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. తిరుపతి రైల్వేస్టేషన్‌లో టిక్కెట్టు కౌంటర్ వద్ద బాలుడితో కలిసి ఉన్నట్టు సీసీ టీవీ కెమెరాలో దృశ్యాలు రికార్డయ్యాయి. అయితే, ఆ సమయంలో తిరుపతి మీదుగా వచ్చిపోయే రైళ్ల రాకపోకల సమాచారాన్ని పోలీసులు సేకరించారు. దాదాపు 32 గంటలు గడుస్తున్నా బాలుడి ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులు గాలిస్తున్నారు. బాలుడి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మహారాష్ట్ర లాథూర్ నుంచి వచ్చి ప్రశాంత్, దాలింభాయ్ దంపతుల కొడుకు వీరేష్ నిన్న ఉదయం అదృశ్యమయ్యాడు. శ్రీవారి దర్శనానికి వచ్చిన ప్రశాంత్ కుటుంబం తమకు రూమ్ దొరక్కపోవడంతో యాత్రి సముదాయం-2 ఎదురుగా ఉన్న షెడ్‌లో సేదతీరింది. నిద్రిస్తున్న కొడుకును అలానే ఉంచి స్నానానికి వెళ్లిన కుటుంబసభ్యులు తిరిగి రాగానే చిన్నారి బాలుడు కనిపించకపోవడంతో షాక్ అయ్యారు. కుమారుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు చిన్నారి జాడ కోసం చుట్టుపక్కల గాలించారు. అన్ని ప్రాంతాల్లోని పోలీసులను అలర్ట్ చేశారు. సీసీ ఫుటేజ్‌లో మంకీ క్యాప్ ధరించిన వ్యక్తి బాలుడిని ఎత్తుకెళ్లే దృశ్యాలు రికార్డు అయ్యాయి.