ఏపీ వైపు దూసుకొస్తున్న నివర్ తుపాను
* సముద్ర తీరప్రాంతంలో ఈదురుగాలులు * సముద్రంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అలలు * కృష్ణపట్నం పోర్టులో రెండో ప్రమాద హెచ్చరిక జారీ * నెల్లూరు జిల్లాలో అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలు * 12 మండలాల్లోని 118 గ్రామాలకు ప్రమాద హెచ్చరికలు
Cyclone Nivar Live Updates : బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారిన నివర్ తుపాను ఏపీవైపు దూసుకొస్తోంది. తుపాన్ తీవ్రతను ఎదుర్కొనేందుకు ఇప్పటికే నెల్లూరు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధమైంది. జిల్లాలో రాత్రి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తుండగా.. సముద్ర తీర ప్రాంతంలో ఈదురు గాలులు వీస్తున్నాయి. అటు సముద్రంలో ఉవ్వెత్తున అలలు ఎగిసిపడుతుండటంతో. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు.
తూపిలిపాలెం, దుగ్గరాజుపట్నం, శ్రీనివాసపురంతో పాటు కొత్తపట్నం, కృష్ణపట్నం, తుమ్మలపెంట గ్రామాల దగ్గర సముద్రం అల్లకల్లోలంగా ఉంది. దీంతో అక్కడకక్కడ రొయ్యల గుంటల కట్టలు కోతకు గురవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా తీరప్రాంతంలో ఉన్న 12 మండలాల్లోని 118 గ్రామాల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. సూళ్లురుపేట కేంద్రంగా జిల్లా అభివృద్ధి విభాగం జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.
కృష్ణాపట్నం పోర్టులో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక తుపాను తీవ్రతను దృష్టిలో ఉంచుకున్న అధికారులు.. మంగళగిరి నుంచి 40 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని జిల్లాకు తీసుకొచ్చారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జలాశయాలు, చెరువులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే నెల్లూరు జిల్లాలోని సోమశిల, కండలేరు జలాశయాలు గరిష్ట నీటి మట్టానికి చేరుకున్నాయి.
భారీ వర్షాలు కురిస్తే చెరువులకు గండ్లు పడే అవకాశం ఉందని ముందు జాగ్రత్తగా ఇసుక బస్తాలు, ప్రొక్లైను సిద్ధం చేశారు. పలు ప్రాంతాల్లో అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తం చేశారు అధికారులు. ప్రధానంగా ఫైర్ సిబ్బందిని పోలీసులు, రెవెన్యూ అధికారులకు అనుసంధానం చేశారు. జిల్లా కేంద్రంలో టోల్ ఫ్రీ నెంబర్‌ను అందుబాటులో ఉంచారు. ఇక జిల్లా కలెక్టర్ తుపాను తీవత్రపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు.