కర్నూలు జిల్లా వెల్దుర్తి నెత్తురోడింది. శవాల దిబ్బగా మారింది. రక్తపు ధారలతో రహదారి తడిసిపోయింది. మృతుల కుటుంబాల కన్నీటి రోధనలతో దద్ధరిల్లింది. తుఫాన్ వాహనాన్ని ట్రావెల్ బస్సు ఢీ కొన్న ఘటనలో 16 మంది ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. కర్నూలు జిల్లా వెల్దుర్తి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సు తుఫాన్ వాహనాన్ని ఢీ కొట్టడంతో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై అత్యంత వేగంగా వస్తున్న ట్రావెల్ బస్సుకు.. ఓ బైక్ అడ్డురావడంతో.. ఈ ప్రమాదం జరిగింది. అతి వేగంగా వస్తున్న బస్సు బైక్‌ను తప్పించే క్రమంలో డివైడర్‌పై నుంచి కుడివైపు దారిలోకి వెళ్లింది. అదే సమయంలో ఎదురుగా వచ్చిన తుఫాన్ వాహనాన్ని అంతే వేగంతో ఢీ కొట్టింది.
ఈ ఘటనలో తుఫాన్‌లో ప్రయాణిస్తున్న 15 మంది బైక్‌పై వెళ్తున్న మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. తుఫాన్ వాహనం బైక్ పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యాయి. ఇటు ప్రమాదం గురించి తెలియగానే స్థానికులు సహాయకచర్యలు చేపట్టారు. తుఫాన్ వాహనం నుంచి మృతదేహాలను వెలికి తీయడంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తుఫాన్ వాహనం ముందు భాగం పూర్తిగా దెబ్బతినడంతో మృతదేహాలను వెనుకవైపు నుంచి తీయాల్సి వచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న కర్నూలు జిల్లా ఎస్పీ ఫకీరప్ప సహాయక చర్యలను పర్యవేక్షించారు. డెడ్‌బాడీస్‌ను కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ లక్ష్మన్న కుమారుడు శ్రీనాథ్ నిశ్చితార్థం వేడుక కోసం.. అనంతపురం జిల్లా గుంతకల్లుకు వెళ్లారు. వేడుక ముగించుకుని తుఫాన్‌లో తిరుగుప్రయాణం అయ్యారు. కాసేపట్లో సొంతూరు చేరుకుంటారనే లోపే ఈ ప్రమాదం జరిగింది. మరోవైపు గాయపడ్డవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. మరోవైపు బస్సులో ప్రయాణిస్తున్న వారిలో కూడా కొందరికి గాయాలైనట్లు తెలుస్తుంది. ఇటు ప్రమాదంపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్, ఏపీ ప్రతిపక్ష నేత జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.