Who is Kash Patel: కాశ్ పటేల్ ఎవరు? ఎఫ్‌బీఐ చీఫ్‌గా డోనల్డ్ ట్రంప్ ఆయన్నే ఎందుకు ఎంచుకున్నారు?

Update: 2024-12-01 07:15 GMT

Who is Kashyap Patel and why Donald Trump appointed him as FBI chief: కశ్యప్ పటేల్.. ఆయన్నే అమెరికాలో సింపుల్‌గా కాశ్ పటేల్ అని కూడా పిలుస్తారు. డోనల్డ్ ట్రంప్ కంట్లో పడిన ఇండియన్ అమెరికన్స్‌లో ఈ కాశ్ పటేల్ కూడా ఒకరు. అందుకే ఆయనకు డోనల్డ్ ట్రంప్ ఏకంగా ఎఫ్‌బీఐ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ) చీఫ్‌గా అపాయింట్ చేశారు. కశ్యప్ పటేల్‌ను ఎఫ్‌బీఐ చీఫ్‌గా అపాయింట్ చేస్తూ ఆయన్ని అమెరికా ఫస్ట్ ఫైటర్‌గా ట్రంప్ ప్రశంసించారు.

కశ్యప్ పటేల్ తల్లిదండ్రులది గుజరాత్. అయితే, వారు ముందుగా తూర్పు ఆఫ్రికాకు వెళ్లారు. అక్కడి నుండి అమెరికాకు వచ్చి స్థిరపడ్డారు. కశ్యప్ పటేల్ 1980 లో అమెరికాలో జన్మించారు. లాంగ్ ఐలాండ్‌లోని గార్డెన్ సిటీ హై స్కూల్‌లో చదువుకున్నారు.రిచ్‌మండ్ యూనివర్శిటీలో అండర్ గ్రాడ్యూయేషన్ చేశారు. న్యూయార్క్‌లో లా కోర్సులో డిగ్రీ చేశారు. ఆ తరువాత లండన్‌కు వెళ్లి అక్కడ లండన్ ఫ్యాకల్టీ ఆఫ్ లాస్ యూనివర్శిటీ కాలేజ్‌లో ఇంటర్నేషనల్ లా చదువుకున్నారు.

"తన తల్లిదండ్రులు ఎప్పుడో భారత్‌ని విడిచిపెట్టినప్పటికీ.. తనని మాత్రం ఒక హిందువుగానే పెంచారు" అని కశ్యప్ పటేల్ చెబుతుంటారు. పబ్లిక్ డిఫెండర్‌గా కశ్యప్ పటేల్ తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. స్టేట్ లెవెల్ నుండి ఫెడరల్ కోర్టుల వరకు అన్ని కోర్టులలో హత్యలు, నార్కో ట్రాఫికింగ్ నుండి ఆర్థిక నేరాలు వరకు అన్ని కేసులు వాదించే వారు.

అమెరికా జాతీయ భద్రతా మండలిలో కౌంటర్ టెర్రరిజం విభాగంలో ప్రెసిడెంట్, సీనియర్ డైరెక్టర్ వద్ద డిప్యూటీ అసిస్టెంట్‌గా కూడా పనిచేశారు. ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డోనల్డ్ ట్రంప్ ప్రాధాన్యతలకు తొలి ప్రాధాన్యం ఇస్తూ కశ్యప్ పటేల్ విధులు నిర్వహించారు.

ముఖ్యంగా అప్పట్లో ప్రపంచానికి పెను సవాల్ విసిరిన ఐఎస్ఐఎస్ (ISIS) ఉగ్రవాదాన్ని అంతమొందించడం, అల్-ఖైదా ఉగ్రవాదులను ఏరిపారేయడం, వారి వద్ద బందీలుగా ఉన్న అమెరికన్స్‌ను సురక్షితంగా కాపాడి అమెరికా తీసుకురావడం వంటి సవాళ్లను విజయవంతంగా పూర్తిచేయడంలో కశ్యప్ పటేల్ కీలక పాత్ర పోషించారు. అందుకే కశ్యప్ పటేల్ అంటే డోనల్డ్ ట్రంప్‌నకు అంత నమ్మకం.

Tags:    

Similar News