హంటర్ కు క్షమాభిక్ష ప్రకటించిన బైడెన్: అమెరికా అధ్యక్షులకు ఉన్న విశేష అధికారాలు ఏంటి?
Joe Biden: అమెరికా అధ్యక్షులు జో బైడెన్ తన కొడుకు హంటర్ బైడెన్ కు క్షమాభిక్ష ప్రసాదించడం వివాదాస్పదమైంది.
Joe Biden: అమెరికా అధ్యక్షులు జో బైడెన్ తన కొడుకు హంటర్ బైడెన్ కు క్షమాభిక్ష ప్రసాదించడం వివాదాస్పదమైంది. అయితే ఈ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడిగా త్వరలో బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్ తప్పుబట్టారు. ఇది అధికార దుర్వినియోగమేనని ఆయన విమర్శించారు. గతంలో కూడా అమెరికా అధ్యక్షులుగా పనిచేసినవారు తమ కుటుంబ సభ్యులు, బంధువులకు క్షమాభిక్ష ప్రసాదించారు.
హంటర్ పై ఉన్న కేసులు ఏంటి?
ఆయుధం కొనుగోలు కేసులో హంటర్ బైడెన్ దోషిగా తేలారు. దీంతో పాటు మరో రెండు క్రిమినల్ కేసుల్లో కూడా హంటర్ కు బైడెన్ విముక్తి కల్పించారు. 2024 సెప్టెంబర్ లో పన్ను ఎగవేతల కింద తొమ్మిది అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఒకదానిలో ఆయనకు 17 ఏళ్లు, మరో కేసులో 25 ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే ఈ శిక్షలను డిసెంబర్ లో ఖరారు చేయాల్సి ఉంది. ఇదే సమయంలో బైడెన్ తన కొడుకుకు క్షమాభిక్ష ప్రసాదించారు. హంటర్ పై నమోదైన కేసులు రాజకీయ ప్రేరేపితమైనవని బైడెన్ అన్నారు. తన కొడుకును విచారించే రోజుల్లో తాను జోక్యం చేసుకోలేదని డిసెంబర్ 1న విడుదల చేసిన ప్రకటనలో బైడెన్ చెప్పారు. తండ్రిగా, అధ్యక్షుడిగా తాను ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నానో అమెరికా ప్రజలు అర్ధం చేసుకుంటారని భావిస్తున్నానని బైడెన్ చెప్పారు.
అమెరికా అధ్యక్షులకు విశేష అధికారాలు
అమెరికా అధ్యక్షులకు కొన్ని విశేష అధికారాలు ఉంటాయి. ఇందులో క్షమాభిక్ష ప్రసాదించడం ఒకటి. ఎవరైనా ఏదైనా క్రిమినల్ కేసుల్లో దోషిగా తేలితే ఆ కేసుల నుంచి దోషులకు క్షమాభిక్ష ప్రసాదించే అధికారం ఉంది. ఈ కేసుల్లో శిక్ష నుంచి తప్పించడానికి.. లేదా శిక్షలో కొంత భాగం మినహాయించేందుకు కూడా అధికారం ఉంటుంది. అయితే ఈ అధికారాన్ని అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన వారు ఉపయోగించారు.అబ్రహం లింకన్ అధ్యక్షుడిగా ఉన్న సమయం నుంచి ఈ అధికారాన్ని ఉపయోగించారు.తమ కుటుంబ సభ్యులు లేదా తమకు సంబంధించిన వారిని శిక్ష నుంచి తప్పించేందుకు ఈ అధికారాన్ని అమెరికా అధ్యక్షులు ఉపయోగించుకున్నారు.
అబ్రహం లింకన్: 16వ ప్రెసిడెంట్ తన భార్య మేరీ టాడ్ లింకన్ బంధువును క్షమించారు. సివిల్ వార్ సమయంలో కాన్పెడరేట్ మద్దతుదారుగా ఉన్న టాడ్ లింకన్ బంధువు కోసం ఆయన తన అధికారాలను ఉపయోగించారు. ఈ అంశం అప్పట్లో చర్చకు దారి తీసింది.
బిల్ క్లింటన్: తన సవతి సోదరులు రోజర్ క్లింటన్ కు బిల్ క్లింటన్ 2001లో క్షమాభిక్ష ప్రకటించారు. 1985 లోని కొకైన్ కేసులో తన అధికారాలతో ఈ కేసు నుంచి ఆయనకు ఉపశమనం కల్పించారు. డ్రగ్ కేసులో రోజర్ క్లింటన్ దోషిగా తేలారు. అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడానికి కొన్ని రోజుల ముందు క్లింటన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
జార్జ్ డబ్ల్యు.హెచ్. బుష్: తన కొడుకు నీల్ బుష్ కు జార్జ్ డబ్ల్యు . హెచ్ . బుష్ క్షమాభిక్షను ఇచ్చారు. సిల్వరాడో సేవింగ్స్, లోన్ కుంభకోణంలో నీల్ బుష్ చిక్కుకున్నారు. ఈ నిర్ణయం వివాదాస్పదమైంది. కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించేందుకు అధికారాలను తమకు అనుకూలంగా మార్చుకున్నారని అమెరికా అధ్యక్షులపై విమర్శలు వచ్చాయి.
జిమ్మి కార్టర్: అమెరికా 39వ అధ్యక్షుడిగా జిమ్మి కార్టర్ బాధ్యతలు చేపట్టారు. లిబియాకు సంబంధించిన ఆర్ధిక వివాదాల్లో జిమ్మి కార్టర్ సోదరులు బిల్లి కార్టర్ చిక్కుకున్నారు.ఈ కేసు నుంచి కార్టర్ ను రక్షించేందుకు జిమ్మి క్షమాభిక్ష అస్త్రాన్ని ప్రయోగించారు. ఈ అంశం రాజకీయంగా ఆయనకు ఇబ్బందులు తెచ్చిందనే విశ్లేషణలున్నాయి.
డోనల్డ్ ట్రంప్: ట్రంప్ అధ్యక్షుడిగా కొనసాగిన సమయంలో ఈ అధికారాన్ని ఉపయోగించారు. 2020లో ఇవాంక ట్రంప్ మామా చార్లెస్ కుష్నర్ కు క్షమాభిక్ష ప్రకటించారు. తాజాగా కుష్నర్ ను ఫ్రాన్స్ రాయబారిగా ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకొనే ముందు 100 మందికి క్షమాభిక్ష ప్రసాదించారు. అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడానికి కొన్ని రోజుల ముందే ఆయన వీరికి క్షమాభిక్ష అందించారు.