Ukraine: రష్యాకు షాకిచ్చిన ఉక్రెయిన్
*మాస్కో యుద్ధ ట్యాంకులను... ధ్వంసం చేసిన ఉక్రెయిన్ వాయుసేన
Ukraine: యుద్ధంలో రష్యాకు ఉక్రెయిన్ షాక్ ఇచ్చింది. మాస్కో యుద్ధ ట్యాంకులపై ఉక్రెయిన్ గగనతల దాడులను నిర్వహించింది. దీంతో ధ్వంసమైన ట్యాంకర్ల నుంచి భారీగా పొగలు వెలువడ్డాయి. ఈ దృశ్యాలను ఉక్రెయిన్ రక్షణ శాఖ విడుదల చేసింది. ఇప్పటివరకు పుతిన్ సేనలకు చెందిన 2వేల మేర యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేసినట్టు ప్రకటించింది. అయితే ఈ దాడి ఏ ప్రాంతంలో జరిగిందో మాత్రం ఉక్రెయిన్ ప్రకటించలేదు. నిన్న కూడా చెర్నిహివ్‌లో ఓ యుద్ధ ట్యాంకును ధ్వంసం చేసినట్టు ఉక్రెయిన్ రక్షణ శాఖ ఫొటోలను విడుదల చేసింది. కీవ్‌ను రెండ్రోజుల్లో సొంతం చేసుకుంటామనుకున్నారు. కానీ వారికి సాధ్యం కాలేదని ట్విట్‌లో ఉక్రెయిన్ తెలిపింది.
మరోవైపు తమ డిమాండ్లను అంగీకరించాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఉక్రెయిన్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. ఇప్పటివరకు ఉక్రెయిన్‌లో మాస్కో సేనలు అసలు యుద్ధాన్ని ప్రారంభించనే లేదని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ ప్రజలకు ఇది విషాదం లాంటిదన్నారు. కానీ.. ప్రస్తుతం పరిణామాలు తీవ్ర యుద్ధం దిశగా వెళ్తున్నట్టు పుతిన్ వ్యాఖ్యానించారు. యుద్ధం ముగింపు పలికేందుకు తాను చర్చలకు సిద్ధంగా ఉన్నాని పుతిన్ ప్రకటించారు. యుద్ధాన్ని ఆపకుండా పశ్చిమ దేశాలు మరింత ఆజ్యం పోస్తున్నాయని విమర్శించారు. ఈ ప్రక్రియ ఎంత ఆలస్యమైతే తమతో ఒప్పందం చేసుకోవడం కూడా అంతే కఠినతరమవుతుందని మాస్కో అధినేత హెచ్చరించారు.
ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడికి దిగింది. నాటి నుంచి ఉక్రెయిన్‌పై కనిపించిన ప్రతి ప్రాంతంపైనా దాడి చేసింది. నగరాలకు నగరాలు ధ్వంసయ్యాయి. ఉత్తర, తూర్పు, దక్షిణ ఉక్రెయిన్ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా శిథిలమైన భవనాలే కనిపిస్తున్నాయి. 136 రోజుల ఈ యుద్ధంలో మాస్కో దళాలు భీకర పోరాటంతో ఇప్పటివరకు డాన్‌బాస్, మరియూపోల్, ఖేర్సన్ ప్రాంతాలను సొంతం చేసుకుంది. తాజాగా ఖేర్సన్‌పై దాడులు చేస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడితో 60లక్షల మందికి పైగా ఉక్రెయిన్ ప్రజలు దేశం విడిచి వెళ్లిపోయారు. లక్షలాది మంది తమ ప్రాంతాలను వదిలేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత అత్యంత దారుణమైన మానవ సంక్షోభంగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం తెలిపింది.