Runway Collision Averted: టేకాఫ్ అయ్యే విమానానికి అడ్డుగా మరో విమానం... తృటిలో తప్పిన పెను ప్రమాదం.. వీడియో వైరల్

Update: 2024-12-31 11:39 GMT

Runway Collision Averted: వరుస విమాన ప్రమాదాలు తరచుగా విమానాల్లో ప్రయాణించే వారిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒక ఘటన మరువక ముందే మరో ఘటన అన్నట్లుగా గత వారాంతంలో 24 గంటల వ్యవధిలోనే మూడు విమాన ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అందులో కజకిస్తాన్‌లో అజర్‌బైజాన్ ఎయిర్ లైన్స్ విమాన ప్రమాదం ఒకటైతే... సౌత్ కొరియాలో జెజు ఎయిర్ లైన్స్ విమానం క్రాష్ ల్యాండ్ అయిన ప్రమాదం మరొకటి.

ఈ విమాన ప్రమాదాల నుండి ఇంకా తేరుకోక ముందే తాజాగా లాస్ ఏంజెల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో తృటిలో విమానం ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తుగా ఈ ప్రమాదం తప్పింది కానీ లేదంటే ఈ ఘటనలో రెండు విమానాలు ఒకదానినొకటి ఢీకొనేవే అని ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతోంది.

ఇంతకీ ఏం జరిగిందంటే...

లాస్ ఏంజెల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఒక విమానం టేకాఫ్ అయ్యేందుకు రన్‌వే పైకి వచ్చింది. రన్‌వే పై వేగంగా వెళ్తూ ఇంకొన్ని క్షణాల్లో విమానం గాల్లోకి టేకాఫ్ అవబోతుండగా సడెన్‌గా కీ లైమ్ ఎయిర్ ఫ్లైట్ అనే మరో ప్రైవేట్ జెట్ ప్లేన్ రన్‌వే పై అడ్డంగా వచ్చింది. ఆ ప్రైవేట్ జెట్ విమానంలో వాషింగ్టన్‌కి చెందిన గోంజగ యూనివర్శిటీ పురుషుల బాస్కెట్ బాల్ టీమ్ ఆటగాళ్లు ఉన్నారు. అప్పటికే ఈ రెండు విమానాలు ఒకదానికొకటి దగ్గరిగా వచ్చేశాయి.

ప్రైవేట్ జెట్ విమానం రన్‌వే అడ్డంగా వెళ్తుండటం గమనించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ విమానం పైలట్‌కు సూచనలు ఇచ్చే మైకులోనే స్టాప్... స్టాప్... స్టాప్... అంటూ గట్టిగా కేకలు వేశారు. ఈ దృశ్యాలన్నీ ప్లేన్ స్పాటింగ్ లైవ్‌స్ట్రీమింగ్ కెమెరాలో రికార్డయ్యాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ "స్టాప్... స్టాప్... స్టాప్..." అని గట్టిగా అరిచిన కేకలు కూడా అందులో రికార్డయ్యాయి. అంతలోనే రన్‌వే పై ఉన్న విమానం ఈ విమానానికి అతి సమీపంలో నుంచే గాల్లోకి టేకాఫ్ అయింది. దీంతో తృటిలో పెను ప్రమాదం తప్పినట్లయింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కజకిస్తాన్‌లోని అక్టావ్‌లో విమానం కూలిన ఘటనలో 38 మంది చనిపోయారు. సౌత్ కొరియాలో విమానం కూలిపోయిన దుర్ఘటనలో 179 మంది చనిపోగా కేవలం ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్స్ మాత్రమే బతికి బట్ట కట్టారు. 

Tags:    

Similar News