పుతిన్ తీరుతో అమెరికా, నాటో దేశాలు బెంబేలు.. వాగ్నెర్ ముఠాతో పుతిన్ దండయాత్ర..
Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను అందరూ ఒకవైపే చూస్తున్నారు.
Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను అందరూ ఒకవైపే చూస్తున్నారు. కానీ.. పుతిన్‌ను రెండో వైపు నుంచే చూసి.. ఇప్పుడు ప్రపంచ దేశాలు హడలిపోతున్నాయి. అందుకు కారణం వాగ్నెర్ గ్రూప్.. ఇప్పుడు ఈ పేరు ప్రపంచ దేశాల్లో వణుకుపుట్టిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో వాగ్నెర్ గ్రూప్ సృష్టించిన విలయం ఇప్పుడిప్పుడే భయటకు వస్తున్నాయి. ఆయా దేశాల్లో ఉన్న అస్థిరతను అణిచివేయడానికి పుతిన్, వాగ్నెర్ గ్రూప్ ఎలా పని చేస్తుందో తెలుసుకుని అమెరికా, నాటో దేశాలు ఉలిక్కిపడుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్ యుద్ధంలో వాలంటీర్లను పాల్గొనేందుకు అనుమతిస్తామంటూ మాస్కో ప్రకటించడంతో వాగ్నెర్ గ్రూప్‌ను రంగంలోకి దించుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు గతంలో చెఫ్‌గా పని చేసిన యెవెగ్నీ ప్రిగోజిన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రూపే వాగ్నెర్. ఇది కిరాయి మూకలను సప్లయ్ చేస్తుంది. ఇప్పుడు ఇది ప్రపంచ వ్యాప్తంగా ఈ గ్రూప్ సైనిక చర్యలకు దిగుతోంది. సుమారు 30 దేశాల్లో వాగ్నెర్ గ్రూప్ జోక్యం చేసుకుంటున్నట్టు మీడియాలో కథలు వెలువడుతున్నాయి. ఆయా దేశాల్లో నియంతృత్వ పాలకులకు సహకారం అందిస్తూ అక్కడి తిరుగుబాటుదారులను ఉక్కుపాదంతో ఈ వాగ్నెర్ గ్రూప్ అణచివేస్తుంది. అయితే క్రమంగా ఆయా దేశాల్లో వాగ్నెర్ గ్రూప్ పట్టు సాధించి ప్రభుత్వాలను శాసించే స్థాయికి చేరుకున్నాయి.
ప్రకృతి వనరులు పుష్కలంగా ఉన్న డజనుకు పైగా ఆఫ్రికా, గల్ఫ్‌తో పాటు పశ్చిమాసి దేశాల్లో ఈ వాగ్నెర్ గ్రూప్ పాగా వేసింది. ఆఫ్రికా దేశమైన మాలిలో తిరుగుబాటుతో సైనిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అక్కడి ప్రజా ఉద్యమాలను ఈ వాగ్నెర్ సమర్థవంతంగా అణచివేసింది. వాగ్నెర్ గ్రూప్ సభ్యులు 800 మంది అక్కడే తిష్ఠవేశారు. ఇందుకు గాను.. మాలి ప్రభుత్వం నెలకు కోటి డార్లను ఈ గ్రూప్‌కు చెల్లిస్తోంది. మాలితో పాటు లిబియా, సిరియా, మోజాంబిక, వెనుజులా సెంట్రల్ ఆప్రికన్ రిపబ్లిక్, సుడాన్, గల్ఫ్ దేశాలతో పాటు పశ్చిమాసియా దేశాల్లో వాగ్నెర్ గ్రూప్ పట్టు సాధించింది.
వాగ్నెర్ గ్రూప్‌తో పుతిన్‌కు అనేక లాభాలు ఉన్నాయి. విదేశాల్లో రష్యా లక్ష్యాలను సాధించేందుకు నేరుగా సైన్యాన్ని రంగంలోకి దింపకుండా వాగ్నెర్ ముఠాను పుతిన్ వినియోగిస్తారు. అక్కడ ఏదైనా కథ అడ్డం తిరిగితే తనకు సంబంధం లేదని బుకాయిస్తారు. తాజాగా ఉక్రెయిన్‌లోనూ సుమారు 2వేల మంది వాగ్నెర్ ముఠా సభ్యులు జనవరిలోనే చేరుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే రష్యా తనను చంపేందుకు కిరాయి ముఠాలను పంపినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్‌స్కీ ఇటీవల ఆరోపించారు. రష్యా లక్ష్యం తనేనని త్వరలో తనను, తన కుటుంబ సభ్యులను చంపేస్తారని ఆరోపణలు గుప్పించారు.
రష్యా అద్యక్షుడు పుతిన్ స్వయంగా ప్రైవేటు ఆర్మీని రూపొందించుకున్నట్టు ఎప్పటి నుంచో పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయి. 2012 నుంచే పుతిన్ తన ప్రైవేటు సైన్యాన్ని క్రమంగా బలోపేతం చేసినట్టు తెలుస్తోంది. 2015 నుంచి వాగ్నెర్ ముఠా బలోపేతమైంది. అప్పటి నుంచి ఆయా దేశాల్లో నియంతృత్వ పాలకులకు అండగా ఉంటూ వస్తోంది. సిరియాలో ప్రజల తిరుగుబాటును అణిచివేసి రష్యా అనుకూల బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని కాపాడడంలో వాగ్నెర్ ముఠా కీలక పాత్ర పోషించింది. అందుకు ప్రతిగా సిరియాలోని చమురు బావుల్లో వాటాలను కూడా వాగ్నెర్ గ్రూప్ పొందినట్టు సమాచారం.
రష్యా ఏ దేశంపై కన్నేసినా ముందుగా అక్కడ వాగ్నెర్ ముఠా డేగలా వాలిపోతుంది. ఈ గ్రూప్ మొదట యుద్ధం ప్రారంభిస్తే ఆ తరువాత రష్యా లేదంటే ఆయా దేశాల్లో నియంత పాలకుల సైన్యం దాడికి దిగేది. దీంతో యుద్ధంలో సునాసయంగా విజయం సాధించేది ఈ ముఠా. అయితే ఈ ప్రైవేటు ముఠాపై ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. రష్యా చట్టాల ప్రకారం కూడా ప్రైవేటు సైన్యం నిర్వహించడం నేరం. ఈ ముఠాను కూడా ఇప్పటివరకు రష్యా ప్రభుత్వం ధ్రువీకరించకపోవడం గమనార్హం.
జర్మనీ నియంతకు ఇష్టమైన ఒపెరా కంపోజర్ వాగ్నెర్. అతడి పేరిటే ఈ ముఠా ఏర్పటయ్యిందని నిపుణులు చెబుతున్నారు. పుతిన్ చెఫ్ ప్రిగోజియన్ వ్యాపార లక్ష్యాలు.. క్రెమ్లిన్ జాతీయ లక్ష్యాల మధ్య సారూప్యత ఉండడంతో వాగ్నెర్ ముఠాకు ఎదురులేకుండా పోయింది. వాగ్నెర్ ముఠాలో అధికంగా మాజీ సైనికులే ఉంటారు. ఇందులో సభ్యులకు రష్యా సైనికులకు ఇచ్చే జీతం కంటే అధికంగా ఉంటుంది. వాగ్నెర్ ముఠా సభ్యుడు చనిపోతే 50వేల డాలర్లు చెల్లిస్తారు. బ్లూమ్‌బర్గ్ అంచనా ప్రకారం 2017లోనే వాగ్నెర్ గ్రూప్‌లో 6వేల మంది ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు అది 10 రెట్లు బలంగా మారినట్టు పశ్చిమ దేశాలు అరోపిస్తున్నాయి.