Ukraine: యుద్ధ భూమిలోకి అడుగుపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ
Narendra Modi's visit to Ukraine: ఉక్రెయిన్ లో ప్రధాని మోదీ పర్యటన షురూ అయ్యింది. మోదీ ప్రయాణించిన రైలు శుక్రవారం ఉదయం కీమ్ నగరానికి చేరుకుంది. ఆయన అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో భేటీ కానున్నారు.
Narendra Modi's visit to Ukraine: ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ రాజధాని కీవ్ చేరుకున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఉక్రెయిన్ చేరుకున్నారు. సందర్శనకు ముందు, కొనసాగుతున్న వివాదానికి శాంతియుత పరిష్కారం గురించి ఉక్రెయిన్ నాయకుడితో తన అభిప్రాయాలను పంచుకుంటానని ప్రధాని మోదీ చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ పర్యటన చాలా కీలకంగా మారనుంది. 1991లో ఉక్రెయిన్ స్వాతంత్ర్యం పొందిన తర్వాత భారత ప్రధాని ఉక్రెయిన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ప్రధాని మోదీ రైలులో ఉక్రెయిన్‌కు వెళ్లారు.
కీవ్‌లో దాదాపు ఏడు గంటలపాటు ఉన్న సమయంలో, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో మోడీ తదుపరి ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. ఉక్రెయిన్‌లో వివాదాన్ని పరిష్కరించడానికి మార్గాలను కనుగొనడంపై చర్చలు ప్రధానంగా దృష్టి సారిస్తాయని భావిస్తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని భారతదేశం ఇంకా ఖండించలేదు. చర్చలు, దౌత్యం ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని పిలుపునిస్తోంది. గత నెలలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాస్కోలో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో, యుక్రెయిన్ వివాదాన్ని పరిష్కరించడం యుద్ధభూమిలో సాధ్యం కాదని, బాంబులు, బుల్లెట్ల మధ్య శాంతి చర్చలు విజయవంతం కావని మోదీ అన్నారు.
ఉక్రెయిన్, పశ్చిమాసియాలో కొనసాగుతున్న వివాదం 'మనందరికీ తీవ్ర ఆందోళన కలిగించే అంశం' అని మోదీ పోలాండ్‌లో మీడియాతో అన్నారు. 'యుద్ధభూమిలో ఏ సమస్యకూ పరిష్కారం దొరకదని భారత్ బలంగా విశ్వసిస్తోంది. ఏదైనా సంక్షోభంలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం యావత్ మానవాళికి అతిపెద్ద సవాలుగా మారింది. శాంతి, సుస్థిరతను త్వరగా పునరుద్ధరించడానికి మేము సంభాషణ, దౌత్యానికి మద్దతు ఇస్తామని ఆయన అన్నారు. ఇందుకోసం భారత్ తన మిత్ర దేశాలతో పాటు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉంది. వార్సా పర్యటన ముగించుకుని, మోదీ కట్టుదిట్టమైన భద్రత మధ్య రైలులో ఉక్రెయిన్ రాజధాని కీవ్ చేరుకున్నారు. ప్రయాణం దాదాపు 10 గంటలు పట్టింది.