Imran Khan: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఈసీ షాక్‌

Imran Khan: తోఫా కేసులో ఎన్నికల్లో పాల్గొనకుండా ఐదేళ్ల నిషేధం

Update: 2022-10-21 12:12 GMT

Imran Khan: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఈసీ షాక్‌

Imran Khan: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు ఆ దేశ ఎన్నికల సంఘం-పీఈసీ షాక్‌ ఇచ్చింది. ఎన్నికల్లో పాల్గొనకుండా ఇమ్రాన్‌ ఖాన్‌పై అయిదేళ్ల పాటు నిషేధం విధిస్తున్నట్టు పీఈసీ ప్రకటించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 63-1-p ప్రకారం పీఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. తోఫాఖానా కేసులో ఇమ్రాన్‌ తన డిక్లరేషన్‌లో తప్పుడు సమాచారం ఇచ్చినట్టు విచారణలో ఈసీ తేల్చింది. తాజా ఎన్నికల సంఘం నిర్ణయంతో ఇమ్రాన్‌ ఖాన్‌ జాతీయ అసెంబ్లీ నుంచి అనర్హత వేటుకు గురయ్యారు. ఐదేళ్ల వరకు ఆయన పార్లమెంట్‌ ఎన్నికకు అనర్హుడయ్యారు. అయిదేళ్ల నిషేధం పూర్తి అయ్యే వరకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 63-1-p ప్రకారం పార్లమెంట్‌కు కానీ, అసెంబ్లీకి కానీ ఇమ్రాన్‌ పోటీ చేసే అర్హతను కోల్పోయారు. ఒకవేళ ఎక్కడైనా పోటీ చేసి ఎన్నికైనా, దాన్ని పరిగణలోకి తీసుకోరు. చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ సికందర్‌ సుల్తాన్‌ రాజా నేతృత్వంలోని నలుగురు సభ్యులు బెంచ్‌ ఈ తీర్పును వెలువరించింది. ఏకగ్రీవంగా బెంచ్‌ ఈ నిర్ణయాన్ని తీసుకున్నది.

తీర్పు ప్రకారం తోఫాఖానా కేసులో తప్పుడు సమాచారం ఇచ్చిన ఇమ్రాన్‌పై క్రిమినల్‌ చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సంఘం ఇచ్చిన తీర్పును పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఇన్సాఫ్‌ ఖండించింది. ఇమ్రాన్‌ను ఎవరూ అనర్హుడిగా ప్రకటించలేరని స్పష్టం చేసింది. కేవలం ప్రజలు మాత్రమే ఆ తీర్పు ఇవ్వగలరని పీటీఐ నేతలు తెలిపారు. తోఫాఖానా శాఖను 1974లో ఏర్పాటు చేసింది. విదేశాల్లో పర్యటించినప్పుడు, విదేశీ ప్రముఖులు పాకిస్థాన్‌కు వచ్చినప్పుడు ప్రధానికి అందించిన కానుకలు సహజంగా ప్రభుత్వ ఖజానాకు చెందుతాయి. ప్రధాని ముచ్చపడి వాటిని తీసుకోవాలనుకుంటే మాత్రం ఆయా కానుకలకు వెలకట్టి అందులో 50 శాతం విలువను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రధానిగా ఉన్న సమయంలో ఇమ్రాన్‌ఖాన్‌ తనకు వచ్చిన విలువైన కానుకలను నిబంధనలకు విరుద్ధంగా సొంతం చేసుకున్నారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు వాటిని ఇమ్రాన్‌ దుబాయ్‌లో అమ్ముకున్నట్టు ప్రస్తుత ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఆరోపించారు.

దుబాయ్‌లో విక్రయించిన 5కోట్ల 90 లక్షల రూపాయల విలువైన వజ్రాల నగలు కూడా అందులో ఉన్నాయన్నారు. ఖజానా నుంచి తీసుకొన్న ఓ గడియారం ఇప్పటికీ ఇమ్రాన్‌ చేతికి ఉందని షెహబాజ్‌ తెలిపారు. ఈకానుకల వ్యవహారాన్ని ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఎఫ్‌ఐఏ ఇప్పటికే విచారణ ప్రారంభించింది. ఇమ్రాన్‌ ఖాన్‌కు వచ్చిన కానుకలను దుబాయ్‌లో అమ్ముకున్నారని షెహబాజ్‌ షరీఫ్‌ ఆరోపణలు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రధానిగా ఉన్న సమయంలో 58 ఖరీదైన బహుమతులను అందుకున్నారు. వాటిలో 38 లక్షల రూపాయల విలువైన రోలెక్స్‌ గడియారాన్ని కేవలం 7 లక్షల 50 వేల రూపాయలకు ఇమ్రాన్‌ సొంతం చేసుకున్నారట. 15 లక్షల విలువ చేసే మరో రోలెక్స్‌ గడియారాన్ని 2 లక్షల 94వేలు మాత్రమ చెల్లించారట. ఇలా మూడో వంతు కంటే తక్కువగా కట్టి, పలు కానుకలను ఇమ్రాన్‌ సొంతం చేసుకున్నట్టు షెహబాజ్‌ ఆరోపించారు. ఇవే కాకుండా 8 లక్షల విలువైన కానుకలకు రూపాయి కూడా ఖజానాకు చెల్లించకుండా తీసుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కోట్ల విలువైన వజ్రాల నగలతో పాటు పలు కానుకలను దుబాయ్‌లో ఇమ్రాన్ విక్రయించినట్టు షెహబాజ్‌ ఆరోపించారు.

తోఫాపై అధికార పార్టీ పీఎంఎల్‌ఎన్‌ చేస్తున్న విమర్శలను మాజీ ప్రధాని ఇమ్రాన్‌ తోసిపుచ్చారు. అవన్నీ నిరాధారణమైన ఆరోపణలు అన్నారు. నిబంధనల ప్రకారం ఖజానాకు 50 శాతం చెల్లించి తీసుకున్నట్టు చెప్పారు. మూడేళ్ల కాలంలో తనపై ఈ ఒక్క ఆరోపణ మాత్రమే చేయగలిగినందుకు సంతోషం అంటూ అప్పట్లో ఇమ్రాన్‌ సెటైర్‌ వేశారు. నాటకీయ పరిణామాల మధ్య పాక్‌ ప్రధాని పదవి నుంచి ఇమ్రాన్‌ ఖాన్‌ వైదొలిగారు. సొంత పార్టీ నేతల తిరుగుబాటు, మిత్రపక్షాల మద్ధతు ఉపసంహరణతో ప్రభుత్వం మైనార్టీలో పడింది. అవిశ్వాస తీర్మాణంపై జరిగిన ఓటింగ్‌లో ప్రతిపక్షాలు బలనిరూపణ చేసుకున్నాయి. ప్రస్తుతం పీఎంఎల్‌ఎన్‌, పీపీపీ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ప్రధానిగా పీఎంఎల్‌ఎన్‌ పార్టీకి చెందిన షెహబాజ్‌ షరీఫ్‌ ప్రధానిగా ఎన్నికయ్యారు. 

Tags:    

Similar News