స్పీకర్ గారు పిల్లాడికి పాలుపట్టించారు!
మనం మామూలుగా ఇంట్లో పిల్లాడికి పాలు పట్టించండి అంటేనే కాస్త చిరాగ్గా మొహం పెడతాం. అదేదో తల్లిదే బాధ్యత అన్నట్టు ఫీల్ అవుతాం కానీ ఆ పెద్దాయన, ఒక దేశం పార్లమెంట్ స్పీకర్, సభలోని ఓ మహిళా ఎంపీ పిల్లాడికి పాలు పట్టించి ఔరా అనిపించుకున్నారు.
రాజకీయ నాయకులు అనగానే.. మనకి ఒకరిని ఒకరు దుమ్మెత్తి పోసుకునేవారే కళ్ళముందు మెదులుతారు. పిల్లలకు పాలు పట్టించడం అనగానే మహిళలే అనే ఆలోచనే మనకు వస్తుంది. సాధారణంగా ఎంత పనిలో ఉన్నా ఆకలికి బిడ్డ ఏడుస్తుంటే, అమ్మ వచ్చి పాలుపట్టించడమే మనకు తెలుసు. అయితే, ఇప్పుడు మీకో ఆసక్తికర సంఘటన పరిచయం చేస్తున్నాం.
అదో పార్లమెంట్.. ప్రజాసమస్యలపై వాడీ వేడీ చర్చ నడుస్తోంది. ఒక మహిళా పార్లమెంటేరియన్ మాట్లాడాల్సిన సమయం వచ్చింది. ఆమె లేచి నిలుచున్నంతలో ఆమె చిన్నారి బాబు ఆకలితో ఏడుపు అందుకున్నాడు. ఆ సభ్యురాలికి ఏం చేయాలో పాలుపోలేదు. ఇంతలో అక్కడ అనుకోని.. ఎవరూ ఊహించని సంఘటన జరిగింది. సభాపతి (స్పీకర్) ఆ బిడ్డను తీసుకుని.. ఎత్తుకుని పాలు పట్టారు. ఇటువంటి సంఘటన మన దేశంలో అయితే చూడలేం అనుకుంటున్నారు కదూ. అవును నిజమే. ఇది జరిగింది న్యూజిలాండ్ లో.
విషయం ఇదీ..
న్యూజిలాండ్ పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నాయి. తమాటీ కోఫీ అనే ఎంపీ నెల వయసున్న తన కుమారుడిని పార్లమెంటుకు తీసుకొచ్చింది. సభా చర్చలో భాగంగా కోఫీ ప్రసంగించాల్సి వచ్చింది. ఆ సమయంలో బాబు ఏడవడంతో స్వయంగా స్పీకర్ ట్రెవోర్ మల్లార్డ్ తన కుర్చీ వద్దకు తీసుకు రమ్మని ఆదేశించారు. అంతే కాకుండా నెల వయసున్న ఆ చిన్నారికి పాలు కూడా పట్టారు. ఓ వైపు పాలు పడుతూనే సభలో సభ్యుల ప్రసంగాలు విన్నారు. అంతే కాదు ఆ చిన్నారితో ఆడుకుంటూనే సమయానికి మించి ఎక్కువసేపు మాట్లాడిన వారిని వారించారు.
ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ లో ప్రపంచం తో పంచుకున్నారు. 'సాధారణంగా స్పీకర్ కుర్చీలో సంబంధిత అధికారి మాత్రమే కూర్చుంటారు. కానీ నాతో పాటు ఓ అతిథి వచ్చి చేరాడు. కోఫీ కుటుంబంలోకి కొత్త వ్యక్తి వచ్చినందుకు వారికి శుభాకాంక్షలు' అని మెసేజ్ ఇస్తూ చేసిన ఆ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Normally the Speaker's chair is only used by Presiding Officers but today a VIP took the chair with me. Congratulations @tamaticoffey and Tim on the newest member of your family. pic.twitter.com/47ViKHsKkA
— Trevor Mallard (@SpeakerTrevor) August 21, 2019