కెనెడాలో కొత్త ఇమ్మిగ్రేషన్ రూల్స్... వేల మంది భారతీయులు వెనక్కి రాక తప్పదా?
ఈ ఏడాది సెప్టెంబర్ 26 నుంచి కొత్త ఇమ్మిగ్రేషన్ విధానం అమల్లోకి రానుంది. ఇది అమలు చేస్తే విదేశీ విద్యార్థులు, వర్క్ పర్మిట్లపై ఉన్నవాళ్లంతా దేశాన్ని వీడాల్సిందే.
కెనడా ప్రభుత్వం ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ విధానంలో తీసుకు వచ్చిన మార్పులు 70 వేల మంది విదేశీ విద్యార్థులు ఆ దేశాన్ని వదిలి వెళ్లాల్సిన పరిస్థితులు తెచ్చాయి. ఇమ్మిగ్రేషన్ లో పాత విధానాలనే అమలు చేయాలని విదేశీ విద్యార్థులు నిరసనకు దిగుతున్నారు.
ఇమ్మిగ్రేషన్ విధానంలో తెచ్చిన మార్పులు ఏంటి?
వర్క్ పర్మిట్లు, స్టడీ పర్మిట్లను భారీగా తగ్గించాలని జస్టిస్ ట్రూడో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాదు పర్మినెంట్ రెసిడెన్సీ నామినేషన్లను 25 శాతానికి తగ్గించనున్నారు. వచ్చే మూడేళ్లలో దేశ జనాభాలో తాత్కాలిక విదేశీ నివాసితుల సంఖ్యను ఐదు శాతానికి తగ్గించడమే టార్గెట్.
తాత్కాలికంగా పని చేసేందుకు వచ్చే విదేశీ కార్మికుల సంఖ్యపై కూడా పరిమితిని విధిస్తామని కెనడా ప్రభుత్వం తెలిపింది. ఈ దిశగా కెనడా ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ విధానంలో మార్పులు చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 26 నుంచి కొత్త ఇమ్మిగ్రేషన్ విధానం అమల్లోకి రానుంది. ఇది అమలు చేస్తే విదేశీ విద్యార్థులు, వర్క్ పర్మిట్లపై ఉన్నవాళ్లంతా దేశాన్ని వీడాల్సిందే.
ఇమ్మిగ్రేషన్ విధానంలో ఎందుకు మార్పులు తెచ్చారు?
దేశ జనాభాలో 97 శాతం మంది విదేశాల నుంచి వచ్చి స్థిరపడినవారే. దీంతో ఆయా ప్రాంతాల్లో ఇళ్లు, ఉద్యోగాల విషయంలో సంక్షోభం తలెత్తింది. తాత్కాలిక నివాస అనుమతులను తగ్గించాలని స్థానికుల్లో డిమాండ్ మొదలైంది. ప్రధాని ట్రూడో పై వ్యతిరేకత నెలకొందని సర్వే రిపోర్టులు చెబుతున్నాయి.
వచ్చే ఏడాది కెనడాలో ఎన్నికలున్నాయి. దీంతో ఇమ్మిగ్రేషన్ విధానంలో మార్పులకు ట్రూడో సర్కార్ చర్యలు తీసుకుంది. కెనడాలో నిరుద్యోగం 6 శాతం ఉన్న ప్రాంతాల్లో వర్క్ పర్మిట్లను తిరస్కరిస్తారు. ఈ విధానాన్ని నిరసిస్తూ విదేశీ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.
విదేశీయులకు 4 లక్షలకు పైగా పర్మినెంట్ నివాసాలు
కెనడాలో 2022లో 4 లక్షల 37 వేల మంది విదేశీయులకు శాశ్వత నివాసాలను మంజూరు చేసినట్టుగా అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 2023లో ఈ సంఖ్య 4 లక్షల 71 వేలు దాటింది. అయితే ఇందులో ఎక్కువగా ఇండియన్లున్నారు. ఆ తర్వాతి స్థానంలో చైనా, ఆఫ్గానిస్తాన్, నైజీరియా, ఫిలిప్పిన్స్ దేశాలు నిలిచాయి.
118.2 వేల మంది ఇండియన్లు, 31.8 వేల మంది చైనావాసులు, 23.7 వేల మంది ఆఫ్గాన్ వాసులు, 22.1 వేల మంది నైజీరియన్లు, ఫిలిప్పిన్ వాసులు 14.2 వేల మంది ఫ్రాన్స్ వాసులు 2022లో ఇక్కడ శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్నారు.
11.6 వేల మంది పాకిస్తాన్ వాసులు , 11.1 వేల మంది ఇరాన్, 10.4 వేల మంది అమెరికా, 8.5 వేల మంది సిరియన్లు ఇక్కడ శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్నారు. 2016 నుంచి 20121 వరకు 44 శాతం మంది విదేశీయులు ఒంటారియోలో శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. దీని తర్వాతి స్థానంలో టోరంటో నిలిచింది.
టెంపరరీ ఫారిన్ వర్కర్ ప్రోగ్రాం అంటే ఏంటి?
దేశంలోని పారిశ్రామిక అవసరాల కోసం టెంపరరీ ఫారిన్ వర్కర్ ప్రోగ్రాంను కెనడా అమల్లోకి తెచ్చింది. 2022లో 6,04,382 కొత్త వర్క్ పర్మిట్లను శాంక్షన్ చేసింది. వ్యవసాయ కూలీలు, గృహ సంరక్షకులు, స్కిల్డ్ నిపుణులకు ఈ విధానం కింద అనుమతిస్తారు.
దీని కింద కెనడాకు వచ్చిన వారికి గంటకు ఇండియా కరెన్సీలో 800 ల నుంచి 1200 రూపాయాలు చెల్లిస్తారు. ఇక విదేశీ విద్యార్థులు తమ చదువు పూర్తైతే మూడేళ్లపాటు వర్క్ వీసాలపై ఉండే అవకాశం ఉంది.
ఈ సమయంలో శాశ్వత నివాసం కోసం కూడా ధరకాస్తు చేసుకొనే వెసులుబాటు కూడా ఉండేది. కానీ, ఇమ్మిగ్రేషన్ లో మార్పులతో ఇవి ఇక నుండి ఉండవు.
భారతీయులపై ప్రభావం ఎలా ఉంటుంది?
కెనడాలో చదువుకునే విదేశీ విద్యార్థుల్లో భారతీయులు అధిక సంఖ్యలో ఉన్నారు. వీరిలో పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు ఎక్కువగా ఇక్కడ ఉన్నారు. ఇండియన్ జనాభాలో 50 శాతం పంజాబీలే ఉంటారు. మారిన ఇమ్మిగ్రేషన్ విధానంతో ఇండియా నుంచి కూడా వలసలు తగ్గుతాయి.
వలసలను తమ దేశం ఆహ్వానిస్తుందని కెనడా ప్రధాని ట్రూడో చెబుతున్నారు. వ్యవసాయం, ఆహార శుద్ధి, నిర్మాణ, ఆరోగ్య రంగాల్లో వలసలపై మినహాయింపు ఇచ్చారు. ఇమ్మిగ్రేషన్ విధానంలో తీసుకువచ్చిన మార్పులు ప్రభావం భారతీయులపై ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.