Asteroid ‘2024 ON’: భూమికి దగ్గరగా స్టేడియం సైజ్ గ్రహ శకలం... నాసా వార్నింగ్!

ఫుట్ బాల్ స్టేడియం సైజులో ఉన్న భారీ గ్రహశకలం మంగళ, బుధవారాల మధ్య భూమికి దగ్గరగా వస్తోందని నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ – నాసా వార్నింగ్ ఇచ్చింది.

Update: 2024-09-17 12:21 GMT

Asteroid ‘2024 ON’: భూమికి దగ్గరగా స్టేడియం సైజ్ గ్రహ శకలం... నాసా వార్నింగ్!

NASA Alert: ఫుట్ బాల్ స్టేడియం సైజులో ఉన్న భారీ గ్రహశకలం మంగళ, బుధవారాల మధ్య భూమికి దగ్గరగా వస్తోందని నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ – నాసా వార్నింగ్ ఇచ్చింది.

290 మీటర్లు... అంటే దాదాపు 950 అడుగుల పొడవున్న ఈ భారీ గ్రహ శకలాన్ని సైంటిస్టులు ‘2024 ఆన్’ అని పిలుస్తున్నారు. ఇది భూమి నుంచి జస్ట్ 10 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి వెళ్తుందని నాసా తెలిపింది. అంటే, భూమికి, చంద్రుడికి మధ్య ఉన్న దూరానికి రెండున్న రెట్ల దూరం నుంచి పాస్ అయిపోతుందన్న మాట.

అంటే, చాలా దూరం నుంచే వెళ్ళిపోతోంది కదా అనుకోవచ్చు. కానీ, అది కరెక్ట్ కాదు. భూమి మీది లెక్కలతో చూస్తే అది చాలా దూరమే కావచ్చు. కానీ, విశ్వం ప్రమాణాలతో పోల్చితే ఇది కచ్చితంగా తృటిలో తప్పిన ప్రమాదమే అనుకోవాలి.

గంటకు 40,233 కిలోమీటర్ల వేగంతో...

నాసా అంచనాల ప్రకారం ఈ ఆస్టరాయిడ్ గంటకు 40,233 కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొచ్చింది. అంటే, దాని ట్రాజెక్టరీ ఏ కాస్త అటూ ఇటూ అయినా భూమి డేంజర్లో పడుతుంది. అమెరికా టైమ్ ప్రకారం సెప్టెంబర్ 17న ఇది భూమికి క్లోజ్ గా వస్తుంది. భారత కాలమానం ప్రకారం 18వ తేదీ తెల్లవారు జామున భూమికి దగ్గర నుంచి వెళ్తుంది.

ఈ 2024-ఆన్ ఆస్టరాయిడ్‌ను అట్లాస్ స్కై సర్వే జూలై 27న గుర్తించింది. వర్చువల్ టెలిస్కోప్ వెబ్ టీవీలో దీన్ని సెప్టెంబర్ 15-16 తేదీల్లో లైవ్‌లో చూపించారు.

ఈ ఆస్టరాయిడ్ ఆకారం, పరిమాణాలను నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ ఆప్టికల్ టెలిస్కోప్స్ తో నిశితంగా పరిశీలిస్తోంది.

ఇది భూమిని ఢీకొంటే ఏమయ్యేది?

ఈ ఆస్టరాయిడ్ కనుక భూమిని డీకొని ఉంటే ఏం జరిగి ఉండేది? ఒక మహా విస్ఫోటనం సంభవించి ఉండేది. ఆ పేలుడుకు భూమి షాక్ వేవ్స్‌తో దద్దరిల్లిపోయేది. ఏమైనా, ఇప్పుడు ఆ ప్రమాదం తప్పింది. ఆ ఆస్టరాయిడ్ భూమి పక్క నుంచి వెళ్ళిపోయింది. కానీ, అంతరిక్ష శిల వేగం ఇప్పటికీ ఆస్ట్రోనాట్స్‌ను కలవరపెడుతోంది.

నిజానికి ఆస్టరాయిడ్స్ భూమి పక్క నుంచి వెళ్ళిపోవడమన్నది కొత్తేమీ కాదు. ఈ ఏడాదిలో బస్సు సైజు ఆస్టరాయిడ్ ఆర్.క్యూ-5, విమానమంత సైజులోనిని ఆర్.ఎం-10 ఆస్టరాయిడ్ భూమి సమీపం నుంచే వెళ్లిపోయాయి. ఇలాంటి మరికొన్ని గ్రహ శకలాలు కూడా భూమికి ఎలాంటి హాని చేయకుండా దాటుకుని వెళ్ళిపోయాయి.

గతంలో గ్రహ శకలాలు భూమిని ఢీకొన్నాయా?

అలా భూమిని తాకకుండా వెళ్ళిపోయిన ఆస్టరాయిడ్స్ సంగతి సరే... ఇంతవరకూ భూమిని ఏ ఒక్క ఆస్టరాయిడ్ కూడా తాకలేదా? ఎందుకు తాకలేదు...చాలానే తాకాయని అంటోంది నాసా. కొన్ని ఆస్టరాయిడ్స్ భూవాతావరణంలోకి వచ్చి రాకెట్ బాంబుల్లా పేలిపోతుంటాయి. అలాంటి చాలా గ్రహశకలాలు మనకు తెలియకుండానే వస్తుంటాయి.

నాసా చెప్పిన ప్రకారం ప్రతిరోజూ దాదాపు 48.5 టన్నుల గ్రహ శకలాలు భూమి వాతావరణంలోకి వస్తుంటాయి. నిప్పులు చిమ్ముతూ చెదిరిపోతుంటాయి. అయితే, పెద్ద పెద్ద ఆస్టరాయిడ్స్ రావడం అన్నది మాత్రం చాలా అరుదుగా జరుగుతుంటుంది. వీటి వల్ల భూమికి ప్రమాదాలు జరగకుండా, నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు భూగ్రహం సమీప ప్రాంతంలోని ఆస్టరాయిడ్స్ కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటాయి. వాటి ప్రభావం భూమి మీద పడకుండా ఏం చేయాలో ఆలోచిస్తుంటాయి.

ఇప్పటికైతే, ఈ స్టేడియం సైజు ఆస్టరాయిడ్‌తో భూమికి డేంజర్ తప్పినట్లే అని ప్రకటించింది నాసా.

Tags:    

Similar News