ఆక్రమిత వెస్ట్ బ్యాంకులో ఇజ్రాయెల్ దాడులు
Jerusalem: అల్ జజీరాకు చెందిన మహిళా రిపోర్టర్ షిరీన్ అబూ అలేహ్ మృతి
Jerusalem: జెనిన్ నగరంలోని ఆక్రమిత వెస్ట్ బ్యాంకులో ఇజ్రాయెల్ దళాలు చేపట్టిన ఆపరేషన్‌లో అల్ జజీరాకు చెందిన మహిళా రిపోర్టర్ షిరీన్ అబూ అలేహ్ మృతి చెందారు. పాలస్తీనా భూభాగంలో పనిచేస్తున్న తమ రిపోర్టర్ షిరీన్‌ను ఇజ్రాయిల్ దళాలు హతమార్చినట్లు అల్ జజీరా సంస్థ ఆరోపించింది. ఇజ్రాయిల్ దళాలు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి ఈ దారుణానికి పాల్పడిందని తెలిపింది. ఈ దాడి కావాలనే జరిగిందని ఈ అంశంలో అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని అల్ జజీరా కోరింది.
అల్ జజీరా ఆరోపణలను ఇజ్రాయెల్ తోసిపుచ్చింది. తాము కావాలని రిపోర్టర్‌ను చంపలేదని స్పష్టం చేసింది. ఆక్రమిత వెస్ట్ బ్యాంకులో బుధవారం ఉదయం ఆపరేషన్ చేపట్టిన సమయంలో అక్కడి పరిస్థితి అదుపు తప్పిందని ఇజ్రాయిల్ తెలిపింది. దీంతో అనుమానితులు, భద్రతా దళాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయని ఈ క్రమంలో జర్నలిస్ట్ గాయపడిందని ఇజ్రాయిల్ తెలిపింది. గాయపడిన వెంటనే ఆస్పత్రికి తరలించామని కానీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని పాలస్తీనా ఆరోగ్య మంత్రి ద్రువీకరించారు.