హౌడీ-మోడీ ప్రోగ్రామ్‌తో అమెరికా హ్యూస్టన్ సిటీ దద్దరిల్లింది. 70వేల మందికి పైగా ఎన్నారైలు హాజరైన సభకు మోడీ-ట్రంప్ కలిసి పాల్గొనడంతో హ్యూస్టన్ స్టేడియం హోరెత్తిపోయింది. మోడీ-ట్రంప్ ఒకరిపై మరొకరు పొగడ్తల వర్షం కురిపించుకున్నారు. ఇక సభ ముగిశాక ఇద్దరూ కలిసి స్టేడియం మొత్తం కలియదిరుగుతూ, ప్రవాస భారతీయులకు అభివాదం చేశారు.
హౌడీ-మోడీ ప్రోగ్రామ్‌తో అమెరికా హ్యూస్టన్ సిటీ దద్దరిల్లిపోయింది. మోడీ, భారత్ మాతాకీ జై, వందేమాతరం నినాదాలతో ఎన్‌ఆర్జీ స్టేడియం మార్మోగిపోయింది. టెక్సాస్ సెనేటర్ టెడ్ క్రూస్ మోడీని వేదికపైకి ఆహ్వానించగా, రెడ్ కార్పెట్ పై నడుచుకుంటూ మోడీ స్టేడియం లోపలికి వచ్చారు. ఇక, మోడీ వేదికపైకి వస్తుండగా, ప్రవాస భారతీయులు కరతాళ ధ్వనులతో స్వాగతం పలికారు.
70వేల మందికి పైగా ఎన్నారైలు హాజరైన హౌడీ-మోడీ కార్యక్రమంలో మోడీతోపాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కలిసి పాల్గొనడంతో హ్యూస్టన్ ఫుట్‌బాల్ స్టేడియం కోలాహలంగా మారింది. మోడీ-ట్రంప్ కలిసి ఒకేసారి వేదికపైకి రావడంతో ఎన్నారైలంతా హర్షధ్వానాలు చేశారు. చప్పట్లతో స్వాగతం పలికారు. ప్రెసిడెంట్ ట్రంపే కాకుండా, అమెరికాలోని 50 రాష్ట్రాలకు చెందిన సెనేటర్లు, గవర్నర్లు, మేయర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ముందుగా మాట్లాడిన మోడీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కావడం అమెరికన్ల అదృష్టమన్న మోడీ మరోసారి ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ కావాలని ఆకాంక్షించారు. భారత్‌కు నిజమైన శ్వేతసౌధ స్నేహితుడు ట్రంపే అన్నారు.
అనంతరం మాట్లాడిన ట్రంప్ మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఒక్క భారత్‌కే కాదు ప్రపంచానికే మోడీ గొప్ప సేవ చేస్తున్నారంటూ కొనియాడారు. భారత్-అమెరికా సంబంధాలు ఎన్నడూ లేనంత బలోపేతమయ్యాయన్న ట్రంప్ భారత్ అత్యున్నత విలువలు అమెరికా విలువలతో కలిసిపోయాయన్నారు. ఇక, మోడీ-ట్రంప్ రాకముందు, డప్పుల మోతతో హ్యూస్టన్ స్టేడియం దద్దరిల్లిపోయింది. ప్రవాస భారతీయులు తమతమ రాష్ట్రాల సంప్రదాయ నృత్యాలతో హోరెత్తిపోయింది.