Former IAAF president Lamine Diack : అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య మాజీ అధ్యక్షుడికి రెండేళ్ల జైలు
అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఏఏఎఫ్) మాజీ అధ్యక్షుడు, అథ్లెటిక్స్లో అత్యంత శక్తివంతమైన వ్యక్తులలో ఒకరిగా పేరు గడించిన లామిన్ డియాక్ కు జైలు శిక్ష పడింది. ఆయనకు..
అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఏఏఎఫ్) మాజీ అధ్యక్షుడు, అథ్లెటిక్స్లో అత్యంత శక్తివంతమైన వ్యక్తులలో ఒకరిగా పేరు గడించిన లామిన్ డియాక్ కు జైలు శిక్ష పడింది. ఆయనకు ఫ్రాన్స్ కోర్టు రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. రష్యా డోపీలను నిషేధించకుండా పోటీల్లో పాల్గొనేలా భారీ ఎత్తున అవినీతికి పాల్పడటంతో పారిస్ కోర్టు 87 ఏళ్ల డియాక్‌ను దోషిగా తేల్చింది. డియాక్ మొత్తం 3.45 మిలియన్ యూరోలు (1 4.1 మిలియన్లు) లంచం డిమాండ్ చేసినట్టు కోర్టు నిర్ధారించింది.
ఇందుకోసం ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్స్ (IAAF) లోని ఇతర అధికారులు సహకరించారని గుర్తించింది. దీంతో కోర్టు డియాక్‌కు జైలుశిక్షతోపాటు 5 లక్షల యూరోల జరిమానా కూడా విధించింది.. రష్యా డోపీలకు లామిన్ డియాక్ ఉద్దేశపూర్వకంగానే అండదండలు అందించినట్లు కోర్టు తేల్చిందని మహిళా జడ్జి ఈ సందర్బంగా వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పు సమయంలో ఆయన అక్కడే ఉన్నారు.. దీనిపై పైకోర్టుకు అప్పీల్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే అంతవరకు ఆయన అధికారుల పర్యవేక్షణలోనే ఉండాలని కోర్టు ఆదేశించింది.