Moscow: మాస్కోలో భారీ అగ్నిప్రమాదం
Moscow: ఎంకేఎం హోటల్‌లో ఎగిసిపడిన మంటలు
Moscow: సెంట్రల్ మాస్కోలోని ఒక హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతోపాటు ఆరుగురు సజీవదహనమయ్యారు. మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. MKM హోటల్‌లో బస చేసిన ఒక టూరిస్ట్ తన వ్యక్తిగత వస్తువులను కారిడార్‌లో తగులబెట్టడంతో మంటలు చెలరేగాయి. 16 అంతస్తుల భవనంలోని ఐదో అంతస్తులో మంటలు వ్యాపించాయి. ఆ మంటలు హోటల్ భవనం మొత్తం ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. కిటికీల నుండి దట్టమైన బూడిద రంగు పొగలు బయటకు ఎగిసిపడ్డాయి. హోటల్‌లో బస చేసిన టూరిస్ట్‌లు సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. మంటలు దాదాపు 300 చదరపు మీటర్లు వ్యాపించాయి. ఏడుగురు చిన్నారులు సహా 50 మందిని రెస్క్యూ టీం రక్షించింది. పై అంతస్తులలో ఉన్నవారిని రక్షించడానికి రెస్క్యూటీమ్ ఫైర్ మోటార్ నిచ్చెనను ఉపయోగించాల్సి వచ్చింది. మంటలు అదుపులోకి తెచ్చాక హోటల్ భవనంలో ఫైర్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు.