Ethiopia Road Accident: ఇథియోపియాలో పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రక్కు నదిలో పడిపోవడంతో సుమారు 71 మంది మృతిచెందారు. సిదామా ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న ట్రక్కు అదుపు తప్పి నదిలోకి దూసుకెళ్లింది. ఓ వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్టు సమాచారం.
అధికారులు చెబుతున్న ప్రాథమిక వివరాల ప్రకారం ఆదివారం సాయంత్రం 5.30 గంటల సమయంలో ప్రయాణికులతో వెళ్తున్న ట్రక్కు సిదామా ప్రాంతంలో ఒక్కసారిగా అదుపు తప్పడంతో వంతెన పైనుంచి నదిలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 71 మంది చనిపోయారు. వీరిలో 68 మంది పురుషులు, ముగ్గురు స్త్రీలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. గాయపడిని వారిని సమీప హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు.
రోడ్డుపై ఉన్న గుంతలు, ఓవర్ లోడ్ వంటి కారణాల వల్లే ట్రక్కు అదుపుతప్పినట్టు అధికారులు ప్రాథమికంగా తేల్చారు. ఇక్కడ సరైన రోడ్డు సదుపాయాలు లేకపోవడం వల్లే తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని.. వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని అధికారులు తెలిపారు.