South Korea plane crash: ల్యాండింగ్ గేర్ ఫెయిల్ అవ్వడంతోనే ప్రమాదం..విమాన ప్రమాదంలో 179 మంది దుర్మరణం
South Korea plane crash: దక్షిణకొరియాలోని ముయూన్ ఇంటర్నెషనల్ ఎయిర్ పోర్టులో ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి కారణంగా ల్యాండింగ్ గేర్ వైఫల్యమే అని ప్రాథమికంగా తెలుస్తోంది. థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి బయలు దేరిన ది బేజు ఎయిర్ ఫ్లైయిట్ చెందిన 7సి2216 నెంబర్ బోయింగ్ 737-800 శ్రేణి విమానం ల్యాండ్ అవుతూ అదుపుతప్పింది. ఫెన్సింగ్ ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. విమానం ల్యాండ్ కావడానికి ప్రయత్నించిన సమయంలో ల్యాండింగ్ గేర్ సమస్యతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు సిబ్బంది తప్పా మిగతావాళ్లంతా మరణించినట్లు సమాచారం.
ఈ విమానం అప్పటికే ల్యాండింగ్ కు యత్నించి విఫలమైందని అధికారులు తెలిపారు. ఇది నేలపైకి దిగిన తర్వాతే రన్ వే చివరికి వస్తున్న సమయంలో కూడా వేగాన్ని నియంత్రించుకవోడంలో విఫలమైనట్లు తెలిపారు. ఇది ఎయిర్ పోర్టు గోడను ఢీకొనడంతో విమానంలో ఇంధనం ఒక్కసారిగా మండింది. దీంతో మంటలు వ్యాపించినట్లు తెలిపారు.
కొందరు ప్రత్యక్ష సాక్షులు విమానం నేలపైకి దిగే సమయంలో ల్యాండింగ్ గేర్, టైర్లు పనిచేయడం లేదని తెలిపారు. ఏదైనా పక్షిని ఢీకొట్టడం వల్లే అవి పనిచేయకపోయి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తం చేశారు.
ఈ ప్రమాదంలో మొత్తం 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది విమానంలో ఉన్నారు. ఇద్దరు సిబ్బందిని కాపాడారు. 179 మంది మరణించినట్లు యాంహాప్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఈ ఘటనలో విమానం మొత్తం పూర్తిగా కాలిపోయిందని అధికారులు ధ్రువీకరించారు. ఈ విమాన ప్రమాదంపై తాత్కాలిక అధ్యక్షుడు చోయ్ సాంగ్ మోక్ మాట్లాడుతూ అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఇంటీరియర్, ల్యాండ్ మినిస్టర్లకు, పోలీసులు, ఫైర్ సిబ్బందికి మార్గదర్శకాలు జారీ చేశారు. ముయాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో అన్ని విమానాల రాకపోకలను రద్దు చేశారు.