భారత్‌కు అమెరికా హెచ్చరిక.. ఔషధాలు ఎగుమతి చేయకపోతే ప్రతీకార చర్యలుంటాయన్న ట్రంప్

Update: 2020-04-07 07:29 GMT

భారత్, అమెరికా మధ్య హైడ్రాక్సీ క్లోరోక్వీన్ చిచ్చు పెట్టింది. కరోనా రోగులకు చికిత్స అందించేందుకు హైడ్రాక్సీ క్లోరోక్వీన్ మాత్రలను అందజేయాలంటూ వినతిని భారత్‌ పట్టించుకోకపోవడంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ ఔషధాలను ఎగుమతి చేయొద్దన్నది భారత్ విధానమైతే ప్రతీకార చర్యలుంటాయని హెచ్చరించారు. మోడీతో ఫోన్‌లో మాట్లాడనని క్లోరోక్వీన్ అవసరాన్ని వివరించినట్లు మీడియా సమావేశంలో ట్రంప్ వివరించారు. ఔషధ రంగంలో అమెరికాకు భారత్‌ సుదీర్ఘ కాలం నుంచి ప్రధాన భాగస్వామ్య పక్షంగా కొనసాగుతుందని ట్రంప్ చెప్పారు.

హైడ్రాక్సీ క్లోరోక్వీన్ సహా కరోనా చికిత్సలో ఉపయోగపడే ఇతర మందుల ఎగుమతిపై భారత్‌ నిషేధం విధించింది. ఈ ఇన్‌ఫెక్షన్‌కు టీకా, ఔషధం లేకపోవడంతో హైడ్రాక్సిక్లోరోక్విన్‌పై ట్రంప్‌ ఆశలు పెట్టుకున్నారు. ఈ ఔషధాన్ని మలేరియాకు చికిత్స చేసేందుకు ఉపయోగిస్తున్నారు. కొవిడ్‌-19 రోగులకు ఇతర ఔషధాలతో కలిపి హైడ్రాక్సిక్లోరోక్విన్‌ను కూడా ఇవ్వాలని అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ సూచించింది. దీంతో అమెరికా హైడ్రాక్సిక్లోరోక్విన్‌ కోసం భారత్ వైపు చూస్తోంది.

మరోవైపు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని మరికొన్ని దేశాల నుంచి కూడా విజ్ఞప్తులు వస్తున్నాయి. భారత్‌లోనూ కరోనా మహమ్మారి రోజురోజుకీ తన ఉనికిని విస్తరిస్తూ పోతోంది. అత్యధిక జనాభా కలిగిన భారత్‌ వంటి దేశాల్లో వైరస్‌ను కట్టడి చేయాలంటే వ్యూహాత్మక ఔషధ నిల్వలు భారీ స్థాయిలో ఉండాల్సిన అవసరం ఉంది. మరి ఈ పరిణామాల నేపథ్యంలో భారత్‌ ఎలా స్పందిస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది.

Tags:    

Similar News