డోనల్డ్ ట్రంప్‌ను దోషిగా ప్రకటించిన న్యూయార్క్ కోర్టు... ఆయన అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయవచ్చా?
జూలై 11న ట్రంప్ నకు శిక్ష ఖరారు చేయనున్న కోర్టు
Donald Trump: డోనల్డ్ ట్రంప్ ను హష్ మనీ కేసులో దోషిగా నిర్ధారించింది న్యూయార్క్ కోర్టు. పోర్న్ స్టార్ స్టోర్మీ డేనియల్స్‌కు చెల్లింపుల కేసులో ఆయనపై నమోదైన వాటిల్లో 34 అభియోగాలకు సంబంధించి కోర్టు దోషిగా తేల్చింది. డేనియల్స్ కు 1,30,000 డాలర్లు చెల్లించడానికి తన వ్యాపార రికార్డులను ట్రంప్ తప్పుగా చూపించారనే అభియోగాలపై విచారించిన న్యూయార్క్ కోర్టు ఆయన దోషి అని తేల్చింది.
జూలై 11న ట్రంప్ నకు శిక్ష ఖరారు చేయనున్న కోర్టు
హష్ మనీ కేసులో ట్రంప్ నకు 2024 జూలై 11న కోర్టు శిక్షను ఖరారు చేయనుంది. ట్రంప్ నకు ఖరారయ్యే శిక్షపై న్యాయస్థానాల్లో తీవ్రంగా పోరాటం చేయాలని ట్రంప్ తరపు న్యాయ బృందం యోచిస్తుందని ఆయన న్యాయవాది టాడ్ బ్లాంచ్ చెప్పారు. ఈ ఏడాది నవంబర్ లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరపున ట్రంప్ బరిలోకి దిగనున్నారు.
డోనల్డ్ ట్రంప్ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటారు?
హష్ మనీ కేసులో అమెరికా మాజీ అధ్యక్షడు డోనల్డ్ ట్రంప్ నకు ఎలాంటి శిక్ష విధిస్తారో జూలైలో తేలనుంది. ట్రంప్ పై మోపిన 34 అభియోగాలు అతి తక్కువస్థాయి నేరాలు. ఒక్కో నేరానికి నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తారు. ట్రంప్ ను ప్రొబేషన్ అధికారికి క్రమం తప్పకుండా రిపోర్ట్ చేయాలని కోర్టు షరతు విధించవచ్చు. ప్రొబేషన్ లో ఉన్న సమయంలో మరిన్ని నేరాలకు పాల్పడితే జైలుకు పంపే అవకాశం ఉంది. వారాంతపు జైలు శిక్షతో పాటు ప్రొబేషనరీ శిక్షను కూడా ట్రంప్ నకు విధించే అవకాశం లేకపోలేదని డిఫెన్స్ లాయర్ డాన్ హూర్విట్జ్ సీబీఎస్ న్యూస్ కు చెప్పారు.