563 కు చేరుకున్న 'కరోనావైరస్' మృతుల సంఖ్య.. ఆ ప్రయోగం ఫలితాన్ని ఇస్తుందా!
చైనాలో కరోనావైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 563 కు చేరుకుంది. బుధవారం (ఫిబ్రవరి 5) 73 మంది మరణించారు. చైనాలో ఇది ఇప్పటివరకు అత్యధిక మరణాల సంఖ్యగా నమోదయింది. అలాగే మొత్తం ధృవీకరించబడిన కేసులు 28,018 కు పెరిగాయని చైనా ఆరోగ్య అధికారులు గురువారం (ఫిబ్రవరి 6) తెలిపారు. బుధవారం నాటికి కొత్తగా అంటువ్యాధి కేసులు 3,694 నమోదైనట్టు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రకటించింది. మృతుల్లో 70 మంది హుబీ ప్రావిన్స్‌కు చెందినవారు, వీరంతా వైరస్ వ్యాప్తికి కేంద్రంగా ఉన్న వుహాన్ లో నివసిస్తున్నట్టు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
టియాంజిన్, హీలాంగ్జియాంగ్ మరియు గుయిజౌ ప్రావిన్సులు ఒక్కొక్క మరణం సంభవించినట్లు కమిషన్ తెలిపింది. బుధవారం 5,328 కొత్త అనుమానిత కేసులు నమోదయ్యాయి, వాటిలో 2,987 హుబీలో నమోదయ్యాయి. అంతేకాదు బుధవారం 640 మంది రోగులు కూడా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు, 3,859 మంది తీవ్ర అస్వస్థతో ఉన్నారని కమిషన్ తెలిపింది.
1.86 లక్షల మందికి పైగా వైద్యుల పరిశీలనలో ఉన్నారు. బుధవారం చివరి నాటికి.. హాంకాంగ్ లోని మకావో లో 10 , తైవాన్లో 11 కేసులు నమోదయ్యాయని కమిషన్ తెలిపింది. విదేశాలలో వైరస్ కేసులు బుధవారం నాటికి 182 కి చేరుకున్నాయి. ఫిలిప్పీన్స్ విదేశాలలో మొదటి మరణాన్ని నివేదించగా, హాంగ్ కాంగ్ ఆదివారం (ఫిబ్రవరి 2) మొదటి మరణాన్ని ప్రకటించింది. మరోవైపు వుహాన్‌లో మరిన్ని ప్రత్యేక ఆసుపత్రులను ఏర్పాటు చేయడంతో రాబోయే రోజుల్లో కేసులు తగ్గుతాయని చైనా అధికారులు భావిస్తున్నారు.
కరోనావైరస్ (2019-nCoV) పై దాని సామర్థ్యాన్ని పరీక్షించడానికి క్లినికల్ ట్రయల్స్‌లో ఉంచడానికి యాంటీ వైరల్ డ్రగ్ ఓషధమైన రెమ్‌డెసివిర్ బ్యాచ్ త్వరలో చైనాకు చేరుకుంటుందని చైనా సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తెలిపింది. విదేశాలలో ఎబోలా ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి రెమ్‌డెసివిర్‌ను ఉపయోగించినట్లు మీడియా కథనాలు తెలుపుతున్నాయి. కరోనావైరస్ బారిన పడిన రోగులకు నయం చేయడానికి ఇప్పటివరకు సరైన చికిత్స లేదు. తాజాగా ఈ ప్రయోగం ఫలితాన్ని ఇస్తుందని చైనా ఆశాభావం వ్యక్తం చేస్తోంది.