Covid-19: మరోసారి పడగ విప్పేందుకు కరోనా రెఢీ!
Covid-19: 84 దేశాల్లో భారీగా నమోదు అవుతున్న కరోనా కేసులు
Covid-19: ప్రపంచ దేశాలపై మరోసారి పడగ విప్పేందుకు కరోనా మహమ్మారి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయంగా పెరుగుతున్న కొవిడ్ కేసుల సంఖ్యను చూస్తుంటే అదే అర్థం అవుతోంది. 84 దేశాల్లో భారీగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ..
WHO హెచ్చరించింది. ఈ నెలలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య... సాధారణం కంటే 20 శాతం పెరిగినట్లు ప్రకటించింది. అంతేకాదు.. పారిస్ ఒలింపిక్స్‌లో 40 మంది అథ్లెట్లు కరోనా సంబంధమైన శ్వాసకోశ వ్యాధుల బారిన పడ్డారని వెల్లడించింది. కోవిడ్ టెస్టులు చేస్తే 10శాతం పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని WHO డాక్టర్ వాన్ కెర్ఖోవ్ తెలిపారు.
కరోనా కేసుల పాజిటివిటీ ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉందన్నారు. అయితే కరోనా మహమ్మారి ఈసారి విరుచుకుపడితే తీవ్రమైన పరిణామాలు వస్తాయని ఆమె అన్నారు. WHO విడుదల చేసిన నివేదిక ప్రకారం.. అమెరికా, యూరప్ మరియు పశ్చిమ పసిఫిక్‌లలో కొత్త ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి.
గత 18 నెలలుగా కోవిడ్ వ్యాక్సిన్ల లభ్యత బాగా తగ్గిందని డాక్టర్ వాన్ కెర్ఖోవ్ చెప్పింది. కరోనా టీకాల ఉత్పత్తిదారుల సంఖ్య కూడా బాగా తగ్గిందని.. కొవిడ్ వ్యాక్సిన్ల మార్కెట్ ఉందని.. టీకాల ఉత్పత్తి పెంచాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు.
కోవిడ్ 19ని ఈ సారి సమర్థవంతంగా ఎదుర్కోడానికి ఆయా దేశాలు చర్యలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. కొవిడ్ మహమ్మారి ప్రభావం పూర్తిగా తగ్గిందని అనుకోవడం తప్పే అవుతుందని.. దీనిపై పునరాలోచన చేయాలని ప్రపంచ దేశాలకు డాక్టర్ వాన్ కెర్ఖోవ్ సూచించారు. తీవ్రత ఎక్కువగా ఉండే వేరియంట్లు పెరిగే ప్రమాదం ఉందని ఆమె తెలిపారు.
ఇప్పటికీ కొవిడ్ మనతోనే ఉందని చెప్పారు. ఇటీవలి కాలంలో ప్రపంచంలోని వివిధ దేశాల్లో సీజన్‌తో సంబంధం లేకుండా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందని వాన్ కెర్ఖోవ్ స్పష్టం చేశారు. వేసవిలో కూడా కరోనా వైరస్ చాలా వరకు వ్యాపించిందని WHO వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న దానికంటే 2 నుంచి 20 రెట్లు వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది.