Russia: ముగిసిన రష్యా తిరుగుబాటు సంక్షోభం
Russia: రష్యా,వాగ్నర్ సైన్యం మధ్య రాయబారం నడిపిన బెలారస్ అధ్యక్షుడు
Russia: రష్యాలో తీవ్ర కలకలం రేపిన తిరుగుబాటు సంక్షోభం ముగిసింది. బెలారస్ అధ్యక్షుడి రాయబారంతో.. రష్యా సైన్యం, వాగ్నర్ గ్రూప్మధ్య రాజీ ఒప్పందం కుదిరింది. రష్యా ప్రైవేటు సైన్యం ఆకస్మాత్తుగా చేపట్టిన సాయుధ తిరుగుబాటుకు రక్తపాతం లేకుండా తెరపడింది. వాగ్నర్చీప్ ప్రిగోజిన్‌పై క్రిమినల్కేసు ఎత్తివేయడం వల్ల అతడి వెంట నడిచిన ముఠా సభ్యులపై విచారణ ఉండదని క్రెమ్లిన్ ప్రకటించింది.
రష్యా అధ్యక్షుడు పుతిన్ పెంచి పోషించిన ప్రైవేట్ సైన్యం వాగ్నర్ గ్రూపు ఆయనపై తిరుగుబాటు జెండా ఎగురవేసింది. ఒక్కొక్క నగరాన్నీ దాటుకుంటూ మాస్కోకు 200 కిలో మీటర్ల దూరం వరకు వెళ్లింది. ఈ తిరుగుబాటును సమర్థంగా తిప్పికొట్టేందుకు పుతిన్ ప్రభుత్వం.. భారీగా సైనిక వాహనాలు, బలగాల్ని మోహరించింది. దీంతో పెద్దఎత్తున రక్తపాతం తప్పదన్న భయానక వాతావరణం నెలకొంది. పుతిన్ మాస్కోను వీడి బంకర్లోకి వెళ్లినట్లు ప్రచారం జరిగింది.
మాస్కోకు దక్షిణంగా ఉన్న కీలక నగరం రొస్తోవ్-ఆన్-డాన్‌లోని రష్యా సైనిక కార్యాలయాన్ని వాగ్నర్ సైన్యం తన ఆధీనంలోకి తీసుకుంది. సైనిక కార్యాలయంలో తీసుకున్న వీడియోను ప్రిగోజిన్విడుదల చేశారు. తాము న్యాయం కోసం పోరాటం చేస్తున్నామని, తిరుగుబాటు కాదని పేర్కొన్నారు. మాస్కో సైనిక నాయకత్వాన్ని కూలదోసేందుకు అన్నిచర్యలు తీసుకుంటామని ప్రకటించారు. పుతిన్స్థానంలో కొత్త అధ్యక్షుడు వస్తారని ప్రిగోజిన్ జోస్యం చెప్పారు. రష్యా సైనిక నాయకత్వాన్ని కూలదోస్తామని ప్రిగోజిన్ చెప్పినట్లు ఉన్న ఆడియో క్లిప్ పుతిన్ ప్రభుత్వాన్ని కలవరానికి గురిచేసింది. ఆ నగరంలోని అన్ని సైనిక స్థావరాలను ఆక్రమించామని ప్రిగోజిన్ తెలిపారు.
ఈ అనూహ్య పరిణామంతో రష్యా అధినాయకత్వం అప్రమత్తమైంది. మాస్కోతోసహా ప్రధాన నగరాలు, దక్షిణ ప్రాంతాలైన రొస్తోవ్, లిపెట్స్క్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని మాస్కో మేయర్ సూచించారు. వాగ్నర్చీఫ్ ప్రిగోజిన్‌పై రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ క్రిమినల్ కేసు పెట్టింది. ప్రిగోజిన్ ఆదేశాలను వాగ్నర్సేనలు పట్టించుకోవద్దని, అతడ్ని అరెస్టు చేయాలని ఆదేశించింది. ప్రైవేటు సైన్యం చేరకుండా ఉండేందుకు మాస్కోను అనుసంధానం చేసే మార్గాన్ని మూసివేసినట్లు స్థానిక గవర్నర్ తెలిపారు. వాగ్నర్ చీఫ్ప్రిగోజిన్ బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో చర్చలు జరిపి సంధి ప్రయత్నాలు చేశారు. ఉద్రిక్తతను సడలించడానికి బలగాలను నిలువరించాలని కోరారు. దీనికి తమ నేత అంగీకరించారని రష్యా 24 వార్తా ఛానల్ తెలిపింది.
వాగ్నర్దళానికి భద్రతపరమైన హామీలు ఇవ్వడం ద్వారా సంధి కుదిరిందని వెల్లడించింది. ప్రిగోజిన్కూడా రక్తపాతం లేకుండా చేయడానికి తమ దళాలను వెనక్కితీసుకునేందుకు అంగీకరించినట్లు ప్రకటించారు. ఉక్రెయిన్‌లోని తమ శిబిరాలకు వెళ్లిపోవాలని ఆదేశించినట్లు ప్రిగోజిన్తెలిపారు. ఒప్పందంలో భాగంగా.. రష్యా ప్రభుత్వం ప్రిగోజిన్‌పై పెట్టిన క్రిమినల్ కేసు ఎత్తివేసినట్లు ప్రకటించింది. అతడితో కలిసి తిరుగుబాటుకు యత్నించిన వారిపై విచారణ ఉండదని క్రెమ్లిన్ వెల్లడించింది.