కొత్త కరోనా వైరస్‌లను గుర్తించిన చైనా!

Update: 2021-06-12 15:55 GMT

ల్యాబ్ (పాత చిత్రం)

China: క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని అతలాకుత‌లం చేస్తుంటే.. వైరస్‌ మూలాలపై లోతైన పరిశోధన జరగాల్సిందేనని ప్రపంచ దేశాలు చైనాపై ఒత్తిడి చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో డ్రాగన్‌ దేశం మ‌రో బాంబ్ పెల్చింది. తాము గబ్బిలాలపై జరిపిన పరిశోధనల్లో కరోనా ఫ్యామిలీకి చెందిన మరికొన్ని వైరస్‌లను కనుగొన్నట్లు ప్ర‌క‌టించింది.

మే, 2019-నవంబరు 2020 మధ్య అడవిలో ఉండే చిన్న గబ్బిలాల మూత్రం, విసర్జితాలు, వాటి నోటి నుంచి సేకరించిన నమూనాలను పరిశీలించి కొత్త కరోనా వైరస్‌లను గర్తించినట్లు తెలిపారు. వీటిలో కొన్ని ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న సార్స్‌-కొవ్‌-2కు జన్యుపరంగా దగ్గరగా ఉన్నట్లు చైనా పరిశోధకులు తెలిపారు. నైరుతి చైనాలో గబ్బిలాలపై జరిపిన పరిశోధనలతో ఎన్ని రకాల కరోనా వైరస్‌లు ఉన్నాయి? వీటిలో ఎన్నింటికి మనుషులకు సోకే సామర్థ్యం ఉందో? తేలనుందన్నారు.

స్పైక్‌ ప్రోటీన్‌పై ఉండే జన్యు క్రమాన్ని మినహాయిస్తే వీటిలో ఒక వైరస్‌ పూర్తిగా సార్స్‌-కొవ్‌-2ను పోలి ఉందని పరిశోధకులు తెలిపారు. 2020 జూన్‌లో థాయ్‌లాండ్‌లోనూ సార్స్‌-కొవ్‌-2ను పోలిన కరోనా వైరస్‌ను గుర్తించినట్లు ఈ సందర్భంగా గుర్తుచేశారు. దీంతో పాటు తాజాగా గుర్తించిన వైరస్‌లను పరిగణనలోకి తీసుకుంటే కరోనా వైరస్‌ గబ్బిలాల్లో సంచరిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. మొత్తం 24 రకాల కరోనా వైరస్‌లను గుర్తించామని.. వీటిలో నాలుగు సార్స్‌-కొవ్‌-2కు దగ్గరగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ మేరకు 'సెల్‌' అనే జర్నల్‌లో అధ్యయన ఫలితాలను ప్రచురించారు.

Tags:    

Similar News