Bangladesh Crisis: షేక్ హసీనా ఆరోపణలు నిజమేనా?సెయింట్ మార్టిన్ ద్వీపం మీద అమెరికా కన్నేసిందా?

Bangladesh Crisis: సెయింట్ మార్టిన్ ద్వీపంపై అమెరికాకు సార్వభౌమత్వాన్ని అప్పగిస్తే తాను ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి వచ్చేది కాదని బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా ప్రకటించారు.

Update: 2024-08-12 10:04 GMT

sheikh hasina

Bangladesh Crisis:సెయింట్ మార్టిన్ ద్వీపంపై అమెరికాకు సార్వభౌమత్వాన్ని అప్పగిస్తే తాను ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి వచ్చేది కాదని బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా ప్రకటించారు. ఈ ద్వీపంపై అమెరికా ఎందుకు కన్నేసింది. దీంతో ఆ దేశానికి ఎలాంటి లాభం ఉందో తెలుసుకుందాం.


 సెయింట్ మార్టిన్ ద్వీపం ఎక్కడుంది? 

సెయింట్ మార్టిన్ ద్వీపం బంగ్లాదేశ్ కాక్స్ బజార్ టెక్నాఫ్ నకు దక్షిణాన 9 కి.మీ. దూరంలో ఉంది. బంగాళాఖాతంలో ఈశాన్యభాగంలో ఉన్న ఈ ద్వీపం మయన్మార్ కు కూడా దగ్గరగానే ఉంటుంది. నాఫ్ నది ముఖద్వారం వద్ద ఇది ఉంది. దేశంలో ఉన్న ఏకైక పగడపు దీవి ఇది. దీని మొత్తం వైశాల్యం 1.2 చదరపు మైళ్లు. ద్వీపం పొడవు 9 కి.మీ., వెడల్పు 0.5 కి.మీ. ఉంటుంది. ఈ ద్వీపంలో 3700 మంది నివాసం ఉంటున్నారు. ఈ ద్వీపంలో తొలుత 18వ శతాబ్దంలో అరేబియా వ్యాపారులు స్థిరపడ్డారు. దీనికి జజీరా అని పేరు పెట్టారు. ఆ తర్వాత బ్రిటీష్ వాళ్లు ఈ ద్వీపాన్ని ఆక్రమించారు. ఆ సమయంలో దీని పేరును సెయింట్ మార్టిన్ గా మార్చారు. స్థానికంగా ఈ ద్వీపాన్ని కొబ్బరి ద్వీపమని, దారుచిని ద్వీప్ అంటే దాల్చిన చెక్క ద్వీపంగా కూడా దీన్ని పిలుస్తారు.


 షేక్ హసీనా అమెరికాపై చేసిన ఆరోపణలు ఏంటి?

బంగ్లాదేశ్ లోని సెయింట్ మార్టిన్ ద్వీపంలో అమెరికాకు వైమానిక స్థావరం కోసం ఒప్పుకొంటే ప్రధాని పదవిని వదులుకోవాల్సి వచ్చేది కాదని షేక్ హసీనా చెప్పారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని తెలిపారు. ప్రధాని పదవికి రాజీనామా చేసిన తర్వాత తొలిసారి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అమెరికాపై ఆరోపణలు చేశారు. ఈ ద్వీపంలో వైమానిక స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి ఓ దేశానికి అనుమతిస్తే తన ఎన్నిక సజావుగా సాగేలా చేస్తానని ఆ దేశం తనకు హామీ ఇచ్చిందని ఆమె ఇటీవల ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక్కడికి ఆ దేశం ఎంట్రీ అయితే భవిష్యత్తులో మరిన్ని సమస్యలకు దారితీసే అవకాశం ఉందని ఆమె చెప్పారు. తాను ఈ సమస్యలు రాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ ద్వీపంపై పట్టుకు ఆదేశ ప్రతిపాదనకు అంగీకరించలేదని తెలిపారు. అమెరికా అనే దేశం పేరును ప్రస్తావించకుండానే అప్పట్లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.


సెయింట్ మార్టిన్ ద్వీపంపై అమెరికా ఎందుకు కన్నేసింది?

సెయింట్ మార్టిన్ ద్వీపం ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే సముద్ర వాణిజ్య మార్గాల్లో ఒకటైన మలక్కా జలసంధికి సమీపంలో ఉంది. సెయింట్ మార్టిన్ ద్వీపంలో సైనిక స్థావరం ఏర్పాటు చేసుకుంటే చైనాలో పెట్టుబడులు, ఆ దేశ కార్యకలాపాలపై నిఘాతో పాటు బంగాళాఖాతంపై పర్యవేక్షణకు అవకాశం దక్కుతుంది. చైనా, బంగ్లాదేశ్, ఇండియా కార్యకలాపాలపై దృష్టి కేంద్రీకరించి నిఘా కార్యకలాపాలు సాగించేందుకు ఇది ఉపయోగపడుతుంది. దక్షిణాసియాలో ముఖ్యంగా బంగాళాఖాతంలో తన సైన్యాన్ని పెంచుకొనేందుకు అమెరికాకు ఈ ద్వీపం కలిసి వస్తుంది. అంతేకాదు చైనా ప్రభావాన్ని తగ్గించేందుకు ఇక్కడ సైనిక స్థావరం ఏర్పాటు చేసుకోవాలని అగ్రరాజ్యం భావిస్తుందనే ప్రచారం ఉంది.


 బంగ్లాదేశ్ ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం చూపుతోందా?

సెయింట్ మార్టిన్ ద్వీపం బంగ్లాదేశ్ కు ఆర్దిక, పర్యావరణ ఆస్తి. ఇది బంగ్లాదేశ్ ప్రత్యేక ఆర్ధిక మండలి పరిధిలోకి వస్తోంది. చేపలు, చమురు, గ్యాస్ వంటి సముద్రవనరులకు ఈ ద్వీపం కేంద్రం. పగడపు దిబ్బలు, విభిన్న సముద్ర జీవులకు ఈ ద్వీపం నిలయంగా ఉంది. అంతేకాదు ఇది ప్రపంచంలో పేరొందిన పర్యాటక కేంద్రాల్లో ఒకటి. సహజసిద్దంగా ఏర్పడిన బీచ్ లను సందర్శించేందుకు టూరిస్టులు ఎక్కువగా ఇష్టపడతారు.


 జంతువులకు సురక్షిత ప్రాంతం

ఈ ద్వీపంలో పగడాలు అధికంగా ఉన్నాయి. మడ అడవులు, మడుగులు, జంతుజాలానికి సురక్షితమైన ప్రాంతం. ఇక్కడ 153 జాతుల సముద్రపు కలుపు మొక్కలు, 66 జాతుల పగడాలు, 240 రకాల చేపలు, 120 జాతుల పక్షలు, 29 రకాల సరీసృపాలు, 29 క్షీరదాలు ఇక్కడ ఉన్నాయని బంగ్లాదేశ్ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎన్విరాన్ మెంట్ పరిశోధనలో తేలింది. సెయింట్ మార్టిన్ ద్వీపం వద్ద వైమానిక స్థావరం కోసం ప్రయత్నాలు చేస్తుందనే ప్రచారాన్ని అమెరికా తోసిపుచ్చింది. బంగ్లాదేశ్ తో తమ భాగస్వామ్యానికి విలువ ఇస్తున్నామని అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ కు చెందిన మిల్లర్ ఈ ఏడాది ఆరంభంలో చెప్పారు. ఈ ప్రతిపాదనను తోసిపుచ్చడంతో ఇందుకు అనుకూలంగా ఉన్న పాలకులను బంగ్లా పీఠంపై కూర్చోబెట్టేందుకు అగ్రరాజ్యం తెరవెనుక చక్రం తిప్పిందని హసీనా ఆరోపించారు.

Tags:    

Similar News