Friday 13th Memes: శుక్రవారం, 13వ తేదీ కలిసి వస్తే కీడు తప్పదా? సోషల్ మీడియా మీమ్స్ వైరల్

Update: 2024-09-14 10:36 GMT

Friday The 13th Fear: సాధారణంగా శుక్రవారం వస్తుందంటే చాలు, చాలామందిలో వీకెండ్ వచ్చేస్తోందన్న జోష్ కనిపిస్తుంది. ఐటి, కార్పొరేట్ రంగాల్లో పనిచేసే వారికి ఈ ఫీలింగ్ ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. కానీ, నిన్నటి శుక్రవారం మాత్రం ప్రపంచవ్యాప్తంగా చాలామందిని భయపెట్టిందట. ఎందుకంటే ఈ శుక్రవారం 13వ తేదీన రావడమే.

శుక్రవారానికి, 13వ తేదీకి ఏం సంబంధం? ఆ రెండింటిని చూసి భయపడాల్సిన అవసరం ఏముందని మీరు అనుకోవచ్చు. అంతేకాదు.. వినడానికి ఇది చాలా సిల్లీగానే ఉందని కొట్టిపారేస్తుండోచ్చు కూడా. కానీ ప్రపంచంలో.. మరీ ముఖ్యంగా క్రీస్తుమతాన్ని ఆచరించేవారిలో చాలామందిని ఈ భయం వెంటాడింది నిజమేనని తెలుస్తోంది.

శుక్రవారం, 13వ తేదీ కలిసి వస్తే ఎందుకంత భయం?

శుక్రవారం, 13వ తేదీ గురించి క్రైస్తవ సమాజంలో ఒక నమ్మకం ఉందని చెబుతుంటారు. అదేంటంటే.. మామూలుగానే శుక్రవారం అంటే కొంతమందికి భయం. అలాగే 13 సంఖ్యను కూడా వాళ్లు కీడుకి సంకేతంగా భావిస్తారు. ఎందుకంటే ఈ రెండూ కూడా వేటికవే దురదృష్టానికి సంకేతం అనేది వారి నమ్మకం. అలాంటిది ఈసారి ఏకంగా ఈ రెండూ కూడా కలిసొచ్చాయి. దీంతో ఇంకేదో పెను ప్రమాదమే ముంచుకొస్తుందనేది వారి భయానికి కారణమైంది.

శుక్రవారం, 13వ తేదీని చూసి అలా భయపడటానికి వారి కారణాలు వారికి ఉన్నాయి. ఎందుకంటే.. యేసు క్రీస్తుని శుక్రవారం నాడే శిలువ వేసినందున వారిలో శుక్రవారం అంటే ఒకరకమైన దురదృష్టమైన రోజుగా ముద్రపడిపోయింది. అలాగే యేసు క్రీస్తును శిలువ వేయడానికి ముందు జరిగిన చివరి విందుకి చాలామంది అతిథులు హాజరయ్యారని బైబిల్ చెబుతోంది. అలా హాజరైన వారిలో 13వ అతిథిగా వచ్చిన జుడస్ స్కారియెట్ అనే వ్యక్తి పెద్ద నమ్మక ద్రోహి అని.. అతడే జీసస్‌ని మోసం చేసి శిలువ వేయించేందుకు కారకుడయ్యాడని బైబిల్ చెబుతోంది. అందుకే వారికి శుక్రవారమన్నా, 13వ సంఖ్య అన్నా భయం. పైగా అవి రెండూ కూడా కీడుకి మారుపేరుగా భావిస్తుంటారు. ఆ కారణంగానే 13వ తేదీన వచ్చిన చివరి శుక్రవారం వారిని మరింత భయపెట్టింది.

ఈ ఫోబియాకు కూడా ఓ పేరుంది

ఇలా శుక్రవారం 13వ తేదీని చూసి భయపడటాన్ని ఫ్రిగ్గాట్రికస్కయిడెక ఫోబియాగా పరిశోధకులు పేరు కూడా పెట్టారు. ఫ్రిగ్గాట్రికస్కయిడెక ఫోబియాలో ఫ్రిగ్గా అంటే శుక్రవారం అని అర్థం. అలాగే ట్రికస్కయిడెక ఫోబియా అంటే 13వ సంఖ్యను చూసి భయపడటం అని అర్థం. ఈ ఫోబియా ఉన్న వారిని "శుక్రవారం ది 13" మరింత భయపెట్టింది.

కానీ, వాస్తవానికి శుక్రవారం, 13వ తేదీ అనేవి మంచివి కావు అని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. అది కేవలం వారి నమ్మకం మాత్రమే. అందుకే, ఇదొక పెద్ద మూఢనమ్మకం అంటూ సోషల్ మీడియాలోనూ రకరకాల మీమ్స్ వైరల్ అయ్యాయి. ఈ మీమ్స్ వైరల్ అవడం వల్లే ఈ శుక్రవారం ది 13 అనే మాటకి మరింత ప్రచారం లభించినట్లయింది.

Tags:    

Similar News