కీలక సమయంలో ఉక్రెయిన్‌కు షాక్ ఇచ్చిన అమెరికా
Ukraine: రష్యా సైన్యాన్ని దీటుగా ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్‌కు అమెరికా బిగ్ షాక్ ఇవ్వనున్నదా?
Ukraine: రష్యా సైన్యాన్ని దీటుగా ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్‌కు అమెరికా బిగ్ షాక్ ఇవ్వనున్నదా? అంటే పెంటగాన్ వర్గాలు అవుననే సమాధానమిస్తున్నాయి. తాజాగా ఉక్రెయిన్ సాయం కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 40 బిలియన్ డాలర్ల ప్యాకెజీని ప్రకటిస్తూ కాంగ్రెస్ సభలో ప్రవేశపెట్టిన బిల్లు పాస్ కాకపోవచ్చనే సంకేతాలను పెంటగాన్ ఇస్తోంది. అదే జరిగితే ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరా తాత్కాలికంగా నిలిచపోనున్నది. ఈ పరిణామం రష్యాకు అనుకూలంగా మారనున్నది. ఇప్పటికే ఉక్రెయిన్‌ను చుట్టుముట్టిన మాస్కో దళాలు దూకుడును మరింత పెంచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమెరికా ఆయుధాలు అందకపోతే పుతిన్ సేనల పోరాటంలో కీవ్ బలగాలకు భారీగా ఆయుధ, ప్రాణనష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.
ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభించింది. బలమైన సైనిక శక్తి, అత్యాధునిక ఆయుధాలున్న రష్యా ఒకటి, రెండ్రోజుల్లోనే ఉక్రెయిన్‌ను ఆక్రమించుకుంటుందని ప్రపంచ దేశాలు భావించాయి. కానీ మాస్కో బలగాలను ఉక్రెయిన్ ఎక్కడికక్కడ తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. పుతిన్ సేనలు ముందుకు రాకుండా అడ్డుకుంటున్నాయి. అందుకు కారణం పాశ్చాత్య దేశాలు అందిస్తున్న ఆయుధ, ఆర్థిక సాయమే కారణం. అమెరికా అయితే మరో అడుగు ముందుకేసి ఆయుధ, ఆర్థిక సాయంతో పాటు రష్యా బలగాలను అంతం చేయడానికి ప్లాన్ కూడా గీసి ఇస్తోంది. ఈ క్రమంలోనే రష్య ఆర్మీ జనరల్స్‌ను 12 మందిని ఉక్రెయిన్ హతమార్చినట్టు పాశ్చాత్య మీడియా కోడై కూసింది. అంతేకాదు నల్ల సముద్రంలో రష్యా రక్షణ నౌకను ధ్వంసం చేయడంలోనూ అమెరికా పాత్ర ఉన్నట్టు కథనాలు వెలువడ్డాయి. ఉక్రెయిన్ యుద్ధాన్ని అమెరికానే ముందుండి నడిపిస్తున్నట్టు మాస్కో కూడా పలుమార్లు ఆరోపించింది. ఉక్రెయిన్‌కు ఆయుధ సరఫరాను నిలిపేయాలని కూడా పుతిన్ డిమాండ్ చేశారు. ఆయుధ సాయం కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా రష్యా అధ్యక్షుడు హెచ్చరించారు.
యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు అమెరికా 20 బిలియన్ డాలర్ల ఆయుధ, ఆర్థిక సాయం అందించింది. మరో 40 బిలియన్ డాలర్ల సాయానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇప్పటివరకు అందించిన సాయం 20 బిలియన్ డాలర్లు అంటే మన రూపాయల్లో సుమారుగా లక్షా 54వేల కోట్లను అమెరికా అందించింది. కొత్తగా 3 లక్షల 9 వేల కోట్లను అందించేందుకు బైడెన్ ప్రభుత్వం అమెరికా కాంగ్రెస్‌లో బిల్లును ప్రవేశపెట్టింది. అయితే ఇప్పుడు ఈ బిల్లుపై నీలినీడలు కమ్ముకున్నాయి. తాజా పరిణామాలతో రిపబ్లికన్ సెనేటర్లు బిల్లును అడ్డుకునే అవకాశం ఉందని అమెరికా రక్షణ కేంద్రం పెంటగాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో ఈనెల 19 తరువాత ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరా తాత్కాలికంగా నిలిచిపోయే అవకాశం ఉందని తాజాగా పెంటగాన్ ప్రతినిధి జాన్ కిర్బీ వెల్లడించారు. అయితే ఇప్పటివరకు ప్రకటించిన సాయంలో భాగంగా సాధ్యమైనంత వేగంగా ఉక్రెయిన్‌కు ఆయుధాలను అందజేస్తామని కిర్బీ తెలిపారు. అంటే ఇదివరకు ప్రకటించిన సాయంలో భాగంగా సరఫరా చేయాల్సిన ఆయుధాలను ఉక్రెయిన్‌కు అమెరికా అందిస్తుంది కొత్తగా సాయం మాత్రం చేసే అవకాశాలు లేవని స్పస్టమవుతోంది.
అమెరికా సెనేట్‌లో తాజా ఉక్రెయిన్ సాయానికి సంబంధించిన 39.8 బిలియన్ డాలర్ల ప్యాకేజీ బిల్లును బైడెన్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. బిల్లును ఆమోదింపజేయడంలో బైడెన్ ప్రభుత్వం విఫలమయ్యింది. రిపబ్లిక్ పార్టీకి చెందిన కెంటకీ సెనేటర్ రాండ్ పాల్ ఏకగ్రీవ తీర్మానాన్ని వ్యతిరేకించారు. పైగా ఉక్రెయిన్‌కు కేటాయించే నిధులను ఎలా వినియోగిస్తున్నారో పర్యవేక్షించడానికి ఇన్‌స్పెక్టర్ జనరల్‌ను నియమించాలని మరో రిపబ్లికన్ పార్టీకే చెందిన న్యూయార్క్ సెనేటర్ చక్ షుమేర్ డిమాండ్ చేశారు. అమెరికా సెనేట్ నిబంధనల ప్రకారం బిల్లుకు ఏకగ్రీవ మద్దతు అవసరం. లేదంటే బిల్లుపై తప్పనిసరి చర్చ జరపాల్సిన అవసరం ఉంటుంది. ఏకగ్రీవ మద్దతును కూడగట్టడంలో బైడెన్ పార్టీకి చెందిన డెమోక్రాట్లు విఫలమయ్యారు. మరోవైపు బైడెన్ ప్రభుత్వంపై రిపబ్లికన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. పెరుగుతున్న ధరల కారణంగా అమెరికన్లలో తీవ్ర ఆందోళన వ్యక్తమువుతోందని సెనేటర్ రాండ్ పాల్ వాదించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ నాశనమవుతుంటే ఉక్రెయిన్‌ను ఎలా రక్షిస్తామంటూ పాల్ ప్రశ్నించారు. ద్రవ్యోల్బణం తీవ్రమవుతోందని వీలైనంత త్వరగా బైడెన్ ప్రభుత్వం చర్చలు తీసుకోవాలని పాల్ డిమాండ్ చేశారు.
అమెరికా ఆయుధాల సరఫరా ఆగిపోతే ఉక్రెయిన్‌కు కష్టాలు మొదలవ్వనున్నాయి. అమెరికాతో పాటు పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధ సాయం అందిస్తున్నాయి. అయితే అమెరికాతో పోలిస్తే మాత్రం అవి చాలా తక్కువ. ఇతర దేశాలు అందించే ఆయుధాలు రష్యాతో పోరాటానికి ఏమాత్రం సరిపోవు. ఒక్క వారంలోనే ఉక్రెయిన్ పరిస్థితి తలకిందులయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటివరకు రష్యాను ఎదుర్కొనడానికి ఉక్రెయిన్‌కు అందించిన సాయమంతా బూడిదలో పోసిన పన్నీరు కానున్నది. మరోవైపు ఉక్రెయిన్‌పై పుతిన్ సేనలు దాడులను మరింత ఉధృతం చేశాయి. అటు ఈశాన్య ఉక్రెయిన్‌లోని ఖార్కివ్, ఇటు దక్షిన ఉక్రెయిన్‌లోని ఒడెసా ప్రాంతంలో క్షిపణులతో రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి. మరియూపోల్, ఖార్కివ్‌ను సొంతం చేసుకున్న రష్యా సమరోత్సాహంతో దూసుకెళ్తోంది. ఉక్రెయిన్ వద్ద ఆయుధాలు నిండుకుంటే పుతిన్ సేనల దాడులకు చేతులెత్తేసే అవకాశాలు ఉన్నాయి.
పాశ్చాత్య దేశాల్లో ప్రధానంగా అమెరికా సాయంపైనే ఉక్రెయిన్ ఎక్కువగా ఆధారపడింది. అమెరికా అందించే అత్యాధునిక ఆయుధాలతోనే రష్యాను దీటుగా ప్రతిఘటిస్తోంది. అక్కడి నుంచే ఆయుధ సరఫరా ఆగిపోతే ఉక్రెయిన్‌కు రష్యా బలగాలను అడ్డుకోవడం సాధ్యం కాదు. అదే జరిగితే మాత్రం తొందరలోనే ఉక్రెయిన్ బలగాలు చేతులెత్తేసే అవకాశం ఉంది.