రష్యా-యుక్రెయిన్ యుద్ధాన్ని మోదీ ఆపగలరా ? అజిత్ దోవల్ ఇప్పుడు రష్యాకు ఎందుకు వెళ్తున్నారు?
నేషనల్ సెక్యురిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ఈ వారం రష్యాకు వెళ్లనున్నారు. రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధానికి తెరదింపే దిశగా జరగనున్న చర్చలకు భారత్ మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. ఆ చర్చల కోసమే అజిత్ దోవల్ రష్యా రాజధాని మాస్కోకు వెళ్తున్నారని తెలుస్తోంది. గత రెండు నెలల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యాకి వెళ్లి అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ని, అలాగే ఉక్రెయిన్‌కి వెళ్లి అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కిని కలిసొచ్చారు. రెండు పరస్పర శత్రుదేశాలైన రష్యా, ఉక్రెయిన్‌లో భారత ప్రధాని పర్యటించడం అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అది కూడా యుద్ధభూమిలోకి మరో దేశాధినేత వెళ్లడం ఎంత సాహసోపేత నిర్ణయం అని ప్రపంచదేశాలు మోదీ పర్యటనను ఆసక్తిగా వీక్షించాయి. రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపడానికే మోదీ పర్యటన జరిగిందా అని ప్రపంచదేశాలు భారత్ వైపు చూశాయి.
పుతిన్‌కి ఫోన్ చేసిన మోదీ
గత నెలలో ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లొచ్చిన అనంతరం ప్రధాని మోదీ ఆగస్టు 27న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కి ఫోన్ చేసి మాట్లాడారు. తన ఉక్రెయిన్ పర్యటన వివరాలు పుతిన్‌తో పంచుకున్నారు. దౌత్య పద్ధతిలో ఉక్రెయిన్‌తో శాంతియుతంగా సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని పుతిన్‌కి తెలిపారు. నరేంద్ర మోదీ, వ్లాదిమిర్ పుతిన్‌ల ఫోన్ సంభాషణలోనే పలు కీలక అంశాల ప్రస్తావనకు వచ్చినట్లు వార్తలొచ్చాయి. రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య శాంతి చర్చలకు భారత్ తరపున రాయబారిగా నేషనల్ సెక్యురిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ వ్యవహరిస్తారని ఆ ఫోన్ కాల్ సంభాషణలోనే మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కి చెప్పారనేది ఆ వార్తల సారాంశం. అయితే, ఆ భేటీ ఎప్పుడు జరుగుతుంది అనే విషయంలోనే ఇప్పటివరకు స్పష్టత లేదు. తాజాగా అజిత్ దోవల్ మాస్కో పర్యటనతో మరోసారి రష్యా - ఉక్రెయిన్ పీస్ టాక్స్ తెరపైకొచ్చాయి.
యుద్ధం విషయంలో రష్యా మాటేంటి?
మోదీతో పుతిన్ ఫోన్ కాల్ అనంతరం భారత్‌లో ఉన్న రష్యా రాయబార కార్యాలయం నుండి ఒక ప్రకటన వెలువడింది. రష్యా పట్ల ఉక్రెయిన్ ఆగడాలు ఎక్కువయ్యాయని, ఉక్రెయిన్ విద్వంసపూరిత వైఖరికి చెక్ పెట్టే దిశగానే తమ ప్రతిస్పందన ఉంటుందని రష్యా ప్రకటించింది. ఏదేమైనా ఈ యుద్ధాన్ని ఆపేందుకు రష్యా కూడా ప్రయత్నిస్తోంది అని తమ ప్రకటనలో పేర్కొంది.
రష్యాకు భారత్ చెబుతున్న మాట
పుతిన్‌తో ఫోన్ సంభాషణపై భారత ప్రధాని కార్యాలయం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపైనే పుతిన్‌తో చర్చించడం జరిగిందని, దౌత్య పద్ధతిలో సామరస్యంగా మాట్లాడుకుని యుద్ధాన్ని ఆపేందుకు కృషి చేయాలని రష్యాకు సూచించినట్లుగా పీఎంఓ ప్రకటన స్పష్టంచేసింది.
రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధంలో భారత్ ఎప్పుడూ న్యూట్రల్‌గా వ్యవహరించడం కంటే శాంతిమార్గం వైపు మొగ్గు చూపేందుకే ఆసక్తి చూపిస్తోందని ఉక్రెయిన్ పర్యటన అనంతరమే ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడిన తరువాత కూడా ఈ విషయమై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధానికి తెర దింపేందుకు భారత్ చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుందని మరోసారి చెప్పారు.
యుద్ధం విషయంలో భారత్ చెబితే రష్యా వింటుందా ?
ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో కూర్చుని మాట్లాడేందుకు రష్యా మూడు దేశాలకు ప్రాధాన్యం ఇస్తోంది. అందులో భారత్ కూడా ఒకటి. మిగతా రెండు దేశాల్లో ఒకటి చైనా కాగా రెండోది బ్రెజిల్. ఉక్రెయిన్ విషయంలో ఈ మూడు దేశాల అభిప్రాయాన్ని, సూచనలను తాము గౌరవిస్తాం అని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టంచేశారు. అంతేకాదు.. ఎప్పటికప్పుడు మేం మా ఈ మూడు మిత్ర దేశాలతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాం అని పుతిన్ ప్రకటించారు.
ప్రపంచదేశాల చూపు భారత్ వైపే..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ జోక్యం చేసుకుంటే ఫలితం ఉంటుందని కొన్ని ప్రపంచదేశాలు భావిస్తున్నాయి. తాజాగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోని చెప్పినట్లుగా ఇటలీ మీడియాలో వస్తోన్న వార్తలే అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కితో మాట్లాడిన ఇటలీ ప్రధాని మెలోని.. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం సమస్యను పరిష్కరించేందుకు భారత్, చైనా దేశాలకు అవకాశం ఉందని అభిప్రాయపడినట్లుగా ఇటలీ మీడియాలో వార్తలొచ్చాయి.
మోదీని చూసి ఉక్రెయిన్‌కి కడుపుమండిన క్షణం
జులైలో బారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యాకి వెళ్లి పుతిన్‌కి కౌగిలించుకున్నప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో రష్యా జరిపిన మిస్సైల్ దాడిలో 37 మంది ప్రాణాలు కోల్పోగా అందులో ముగ్గురు చిన్నారులు ఉన్నారనే ఉదంతాన్ని గుర్తుచేస్తూ జెలెన్‌స్కీ ఓ ట్వీట్ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యా దేశానికి నాయకుడు వెళ్లి ప్రపంచంలోనే అతి క్రూరమైన వ్యక్తిని కౌగిలించుకోవడం అంటే రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతిస్థాపనకు భంగం కలగడమే అవుతుందని అభిప్రాయపడ్డారు.
అయితే, గత నెలలోనే ఉక్రెయిన్ కూడా వెళ్లిన ప్రధాని మోదీ.. అక్కడ జెలెన్‌స్కిని గట్టిగా హత్తుకుని మాట్లాడుతూ.. భారత్ కేవలం రష్యాకే కాదు, ఉక్రెయిన్‌కి కూడా ఫ్రెండే అనే సంకేతాన్ని ఇచ్చారు. అంతేకాకుండా రష్యా మిసైల్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల జ్ఞాపకార్ధం ఉక్రెయిన్ ఏర్పాటు చేసిన స్మృతివనాన్ని జెలెన్‌స్కితో కలిసి సందర్శించి నివాళి కూడా అర్పించారు. ఆ విధంగా భారత్ యుద్ధం విషయంలో ఎటువైపూ మొగ్గలేదని, తటస్థంగా ఉంటూ యుద్ధాన్ని ముగించే ప్రయత్నం చేస్తుందనే సంకేతాలు ఇచ్చారు మోదీ.
రష్యా, యుక్రెయిన్ యుద్ధ విధ్వంసాన్ని నివారించడంలో భారత్ ప్రయత్నాలు ఫలించాలని చాలా దేశాలు కోరుకుంటున్నాయి. ఈ ప్రయత్నాలు ఎలా ముందడుగు వేస్తాయన్నది రానున్న రోజుల్లో తేలిపోతుంది.