కొత్త డిగ్రీ కోర్సులన్నీ నాలుగేళ్లే!

Degrees Courses: రాష్ట్రంలో ఇక నుంచి కొత్తగా ప్రవేశపెట్టే డిగ్రీ కోర్సులను

Update: 2023-04-21 04:45 GMT

కొత్త డిగ్రీ కోర్సులన్నీ నాలుగేళ్లే!

Degrees Courses: రాష్ట్రంలో ఇక నుంచి కొత్తగా ప్రవేశపెట్టే డిగ్రీ కోర్సులను నాలుగేళ్ల కాలపరిమితితోనే నిర్వహించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి భావిస్తోంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి మూడేళ్ల వ్యవధితో కంప్యూటర్‌ సైన్స్‌లో బీఎస్‌సీ ఆనర్స్‌ కోర్సును ప్రవేశపెట్టాలని ఇటీవల నిర్ణయించింది. తాజాగా దాన్ని నాలుగేళ్లకు పెంచే ఆలోచనలో ఉన్నారు. ఈ కోర్సులో కంప్యూటర్‌ సైన్స్‌ను ఒక సబ్జెక్టుగా కాకుండా పూర్తిస్థాయిలో బోధించేలా సిలబస్‌కు రూపకల్పన చేస్తున్నారు. కృత్రిమమేధ, సైబర్‌సెక్యూరిటీ, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ తదితర అంశాలను ఇందులో బోధిస్తారు.

తాజాగా విద్యాశాఖ అధికారులు నాలుగేళ్ల డిగ్రీ కోర్సులపై చర్చ జరిపారు. నాలుగేళ్లపాటు కోర్సుల్లో విద్యార్థులు నిలవడం కష్టమని, అర్హులైన అధ్యాపకుల కొరత కూడా ఉందన్న అభిప్రాయాన్ని రాష్ట్ర అధికారులు వ్యక్తం చేశారు. అందుకే కొత్తగా ప్రవేశపెట్టనున్న బీఎస్‌సీ ఆనర్స్‌ ఇన్‌ కంప్యూటర్‌ సైన్స్‌ను మూడేళ్ల కోర్సుగా నిర్ణయించామని తెలిపారు. దాన్ని నాలుగేళ్లకు పెంచడానికి వీలవుతుందని అభిప్రాయపడ్డారు. ఇకపై ప్రవేశపెట్టే కోర్సులను మాత్రం నాలుగేళ్ల వ్యవధితో తీసుకొచ్చే ఆలోచన చేస్తామని యూజీసీ ఛైర్మన్‌కు చెప్పారు. ఒకవేళ మూడేళ్లకే వెళ్లిపోతామని విద్యార్థులు అనుకుంటే జాతీయ నూతన విద్యావిధానం ప్రకారం ఎగ్జిట్‌ ఆప్షన్‌ ఉన్నందున వారికి సాధారణ డిగ్రీ, నాలుగేళ్లు చదివేవారికి ఆనర్స్‌ డిగ్రీ ఇవ్వొచ్చని సమావేశంలో ఏకాభిప్రాయానికి వచ్చారు.

కంప్యూటర్‌ సైన్స్‌ ఆనర్స్‌ కోర్సును రాష్ట్రంలోని 10కిపైగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నారు.అంతేకాకుండా ఈ కోర్సును ప్రైవేట్‌ కళాశాలలకు కూడా అనుమతించబోతున్నారు. ఈ విషయంపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి త్వరలో నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. దీనిపై ఛైర్మన్‌ లింబాద్రి మాట్లాడుతూ డిగ్రీలో ఏటా 2.50 లక్షల మంది చేరుతున్నందున వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. నాలుగేళ్ల కోర్సు వల్ల నేరుగా పీహెచ్‌డీలో చేరొచ్చని, విదేశీవిద్యకు వెళ్లేందుకు కూడా 16 సంవత్సరాల చదువు అవసరమైనందున ఆ ఇబ్బంది కూడా ఉండదన్నారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో.. బీటెక్‌ తరహాలోనే సైన్స్‌లో కూడా నాలుగేళ్ల డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టాలని కళాశాల అధికారులు భావిస్తున్నారు. ఆ కోర్సును రెండేళ్లు ఇక్కడ.. మరో రెండేళ్లు ఆస్ట్రేలియాలో పూర్తిచేసే విధంగా అవకాశం కల్పించాలని యోచిస్తున్నారు. అలాగే బ్రిటన్‌, అమెరికా విశ్వవిద్యాలయాలతో కూడా ఇలాంటి ట్విన్నింగ్‌ కోర్సులను ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు.

Tags:    

Similar News