TSPSC: తెలంగాణలో నేడు గ్రూప్-4 పరీక్ష.. హాజరుకానున్న 9.51 లక్షల మంది అభ్యర్థులు
TSPSC: రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో 2,878 పరీక్ష కేంద్రాలు
TSPSC: గ్రూప్ ఫోర్ పరీక్షకు TSPSC అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.. నియామక పరీక్షల్లో అత్యధికంగా సుమారు తొమ్మిదిన్నర లక్షల అభ్యర్థులు రాయనున్న గ్రూప్ ఫోర్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2 వేల 878 పరీక్షా కేంద్రాలు సిద్ధం చేశారు. ఇవాళ ఉదయం పేపర్ వన్, మధ్యాహ్నం పేపర్ టూ పరీక్ష జరగనుంది. పరీక్షకు 15 నిమిషాల ముందుగానే గేట్లు మూసివేయనున్నట్లు TSPSC ప్రకటించింది.
వివిధ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, వార్డ్ ఆఫీసర్, జూనియర్ ఆడిటర్ తదితర 8 వేల 180 గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు గతేడాది డిసెంబరులో నోటిఫికేషన్ జారీ అయింది. రికార్డు స్థాయిలో 9 లక్షల 51 వేల 321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 2 వేల 878 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పేపర్ వన్ జనరల్ స్టడీస్... మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ టూ సెక్రటేరియల్ ఎబిలిటీస్ ఉంటుంది. ఉదయం పరీక్షకు 8 గంటల నుంచి.. మధ్యాహ్నం పరీక్షకు ఒంటి గంట నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. పరీక్షకు 15 నిమిషాల ముందే గేట్లు మూసి వేస్తామని.. ఆ తర్వాత కేంద్రాల్లోకి అనుమతి ఉండదని TSPSC తెలిపింది.
హాల్‌టికెట్‌తో పాటు ఆధార్, పాన్ కార్డు, పాస్‌పోర్టు వంటి ఏదైనా ప్రభుత్వ గుర్తింపు చూపించాలని TSPSC వెల్లడించింది. హాల్ టికెట్‌పై ఫొటో లేకపోతే.. గెజిటెడ్ అధికారి సంతకంతో ఉన్న మూడు ఫొటోలతో రావాలని TSPSC సూచించింది. అభ్యర్థులందరినీ క్షుణ్నంగా తనిఖీ చేసిన తర్వాతే లోనికి అనుమతిస్తామని చెప్పారు. గతంలో జరిగిన పలు నియామక పరీక్షల్లో బబ్లింగ్ పొరపాట్ల వల్ల వందల మంది అనర్హులయ్యారని, ఈ నేపథ్యంలో OMR షీటుపై వ్యక్తిగత వివరాలు బబ్లింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని.. వెబ్‌సైట్‌లోని మోడల్ OMR షీటు డౌన్‌లోడ్ చేసుకొని ప్రాక్టీసు చేయాలని TSPSC సూచించింది.
వైట్నర్, చాక్ పౌడర్, బ్లేడు, ఎరేజర్‌తో బబ్లింగ్‌లో మార్పులు చేస్తే OMR షీటును మూల్యాంకనం కోసం పరిగణనలోకి తీసుకోబోమని TSPSC స్పష్టం చేసింది. ఒకరి బదులు మరొకరు రాసినా.. ఎలాంటి అవకతవకలకు పాల్పడినా క్రిమినల్ కేసు పెట్టడంతో పాటు భవిష్యత్తులో ఉద్యోగ నియామక పరీక్షలు రాయకుండా డీబార్ చేయనున్నట్లు TSPSC అధికారులు హెచ్చరించారు.