అత్తపై పగతీర్చుకునేందుకు కన్నవారితో కలిసి చోరీ

Update: 2019-10-29 09:53 GMT

అత్తింట్లో చోరీ చేసిందో కోడలు. నవదంపతులను వీడదీసిందన్న అక్కసుతో ఎలాగైనా అత్తపై పగతీర్చుకోవాలనుకుంది. గడసరి అత్తకు మస్కా కొట్టి మెట్టింట్లో సొగసరి కొడలు ఇస్మార్ట్‌గా దొంగతనం చేసింది. పైగా తాను చేసిన దొంగతనాన్ని చెడ్డిగ్యాంగ్‌పైకి నెట్టాలని పక్కాస్కెచ్‌ వేసి బోర్లబొక్క పడింది. అత్తగారికే చుక్కలు చూపించాలనుకున్న ఉత్తమ కోడలు ఇప్పుడు కటకటపాలైంది.

నవవధువు చేసిన నయాదొంగతనం చర్చనీయాంశంగా మారింది. పెళ్లైన నాలుగు నెలలు కూడా కాలేదు కానీ అప్పుడే భర్తతో గొడవలు పడి పుట్టింటికి చేరింది. దీంతో అత్తింటి మీద కోపంతో కొత్త కోడలు చేసిన నిర్వాకం నోరెళ్లబెట్టేలా చేసింది. పక్కా ప్లాన్ తో అత్తింట్లో భారీ చోరీకీ పాల్పడి అరెస్ట్‌ అయిన ఘటన భాగ్యనగరంలోని బోయిన్ పల్లిలో జరిగింది.

ఓల్డ్ బోయినపల్లిలోని మల్లికార్జున కాలనీకి చెందిన 48 ఏళ్ల సరళ భర్తతో కలిసి ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటారు. వారికో కొడుకు ఇటీవలే కామారెడ్డికి చెందిన సుప్రియతో పెళ్లి జరిగింది. అనంతరం అత్తింటికి వచ్చిన కొద్ది రోజులకే భర్తతో గొడవలు. అత్తారింట్లో ఉండనని పుట్టింటికి వెళ్లిపోయింది సుప్రియ. అత్తగారి మీద ఉన్న కోపంతో కుటుంబ సభ్యులతో కలిసి అత్తింట్లో దొంగతనానికి స్కెచ్ వేసింది. కోడలు హోదాలో తన దగ్గరున్న మరో తాళం చెవితో అత్తింట్లో ఎవరూ లేని సమయంలో కారులో వచ్చి రెండున్నర కిలోల బంగారం ఆరున్నర కేజీల వెండిని తీసుకొని గుట్టుచప్పుడు కాకుండా జారుకుంది.

బయటకు వెళ్లి వచ్చిన అత్తింటివారు ఇంట్లో జరిగిన చోరీ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంప్లైంట్ తీసుకున్న పోలీసులు విచారణ షురూ చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్ లను పరిశీలించగా కారులో వచ్చిన సుప్రియ ఆమె పేరెంట్స్ కలిసి ఇంట్లో చోరీ చేసిన వైనాన్ని గుర్తించారు. వెంటనే కొడలును అదుపులోకి తీసుకొని విచారించగా మొత్తం విషయాన్ని పూసగుచ్చినట్లు చెప్పింది. వారం రోజుల్లో కేసు మిస్టరీని ఛేదించిన బోయిన్‌పల్లి పోలీసులను సీపీ అభినందించారు.

అత్తింట్లో తనకున్న గొడవల నేపథ్యంలో తానే చోరీకి పాల్పడినట్లుగా చెప్పారు. తల్లిదండ్రులు, సోదరుడి సహకారంతో చోరి చేశానని తాను దొంగలించిన ఆభరణాల్ని కామారెడ్డిలో దాచినట్లుగా తెలిపింది. దీంతో సుప్రియతో పాటు అందుకు సహకరించిన సోదరుడు, తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. అత్తింటికే కన్నమేసిన కొత్త కోడలు ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.




 


Tags:    

Similar News