వారం రోజుల్లో ఆ యువతి పెళ్ళి కుటుంబ సభ్యులు పెళ్ళి పనుల్లో నిమగ్నమయ్యారు. బంధువులు, స్నేహితులకు పెళ్ళి కార్డులు పంచేస్తున్నారు. మరో రెండు రోజుల్లో తాను చేస్తున్న ఉద్యోగానికి సెలవు పెట్టాలనుకుంది. ఎన్నో ఆశలు, మరెన్నో ఊహలతో పెళ్ళి చేసుకొని కొత్త జీవితంలో అడుగు పెట్టాలనుకున్న ఆమెను దారుణంగా హతమార్చాడో ప్రేమోన్మాది. కత్తితో తాను ఉంటున్న ఇంటికే వచ్చి గొంతుకోసి పరారయ్యాడు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు విడిచింది ఆ యువతి. సిద్దిపేట జిల్లాలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది.
సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన లక్ష్మీరాజ్యం,మణెమ్మల మూడో కూతురు దివ్య. ఏపీజీవీ బ్యాంక్‌లో గతేడాది ఫీల్డ్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపికైంది. అక్టోబర్ నుంచి సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో పని చేస్తోంది. లక్ష్మీనగర్‌లో ఇంటిని అద్దెకు తీసుకుంది. తల్లిదండ్రులు ఆమెతో పాటే ఉంటున్నారు. దివ్యకు వరంగల్ పెరకవాడకు చెందిన సందీప్ అనే యువకుడితో పెళ్ళి నిశ్చయమైంది. ఈ నెల 26 వరంగల్‌లో పెళ్ళి. పెళ్ళికి సమయం దగ్గర పడడంతో వారం రోజుల క్రితం పేరెంట్స్ సొంతూరు ఎల్లారెడ్డిపేటకు వెళ్ళారు. దివ్య ఒక్కతే ఉంటోంది.
ఓ బిల్డింగ్‌లోని ఫస్ట్ ప్లోర్‌లో ఉంటున్న దివ్య బ్యాంక్‌లో పనులు ముగించుకొని రాత్రి ఎనిమిది గంటలకు ఇంటికి చేరింది. అయితే ఎప్పుటి నుంచో దివ్యను ఫాలో అవుతున్న ఓ యువకుడు ఆమె ఉంటున్న ఇంటికి వచ్చాడు. దివ్య మెట్లు దిగే సమయంలో అదునుచూసి తనవెంట తెచ్చుకున్న పదునైన కత్తితో గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాలైన దివ్య అక్కడికక్కడే కుప్పకూలింది. రక్తమోడుతు ప్రాణాలు విడిచింది.
దివ్య తల్లిదండ్రులు ఊరెళ్లినట్లు తెలుసుకున్న దుండగుడు పథకం ప్రకారమే వచ్చి ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలంలో ఎలాంటి ఆయుధం లభించలేదు. యువతి దవడ కింది భాగంలో పెద్ద గాయం ఉంది. అప్పటికే పైఅంతస్తులో ఉన్న కొందరు కేకలు విని బయటకు రాగా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న దివ్యను చూసి 100 నంబరుకు ఫోన్ చేశారు.
8వ తరగతిలో దివ్యతో కలిసి చదువుకున్న వేములవాడకు చెందిన వెంకటేశం అనే యువకుడు ప్రేమ పేరుతో వేధించేవాడని అతడే తన బిడ్డను పొట్టన పెట్టుకున్నాడని మృతురాలి తల్లి మణెమ్మ పోలీసులకు తెలిపింది. కొన్నాళ్లపాటు వేధింపులు కొనసాగగా తర్వాత కేసు పెట్టడటంతో సద్దుమణిగింది. అమ్మాయి ఓయూలో చేరిన తర్వాత ప్రేమ పేరుతో మళ్లీ వేధించడం మొదలు పెట్టాడు. రెండు నెలల నుంచి ప్రేమ పేరుతో వెంటపడటం మొదలు పెట్టడంతో వేములవాడలో కేసు పెట్టాం. అతని తల్లిదండ్రులు వచ్చి ఇకపై అతడు దివ్య జోలికి రాడంటూ రాసి ఇచ్చారు. పెళ్లి చేస్తే ఆ బాధ తప్పుతుందని భావించాం. అంతలోనే కిరాతకానికి పాల్పడ్డాడు అంటూ దివ్య తల్లి రోదిస్తూ చెప్పింది.
అయితే దివ్య హత్య కేసులో గజ్వేల్ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. దివ్య ఫోన్ కాల్స్, డేటాను సేకరిస్తున్నారు. గత కొన్నాళ్లుగా దివ్యను వెంకటేశం అనే వ్యక్తి ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వెంకటేష్ హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన జరిగినప్పుడు వెంకటేశం ఫోన్ సిగ్నల్స్‌ను పోలీసులు గజ్వేల్‌లో గుర్తించినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో దివ్య హత్య కేసులో వేములవాడకు వచ్చారు గజ్వేల్ పోలీసులు. అనుమానితుడు వెంకటేశం ఉండే ఇళ్లు తాళం ఉండటంతో స్థానికులతో విచారిస్తున్నారు. స్థానిక పోలీసుల సహాయంతో వెంకటేశం గురించి ఆరా తీస్తున్నారు. అనుమానితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. మరో పక్క కాసేపట్లో దివ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు.