వలపు వలలో విశాఖ యువత.. ఎక్స్ కార్ట్ సైట్స్‌లో అందమైన అమ్మాయిల ఫోటోలను..
వలపు వల విసురుతారు. అమ్మాయిల ఫొటోలతో ఆకర్షిస్తారు. కాలక్షేపం కోసం కనెక్ట్ అయితే ఫినిష్ అయినట్టే. విశాఖలో ఎక్స్‌కార్ట్ సైట్స్ చీటింగ్‌లు పెరిగిపోతున్నాయి. యువత బలహీనతలను ఆసరా చేసుకుని జేబులు ఖాళీ చేసే ముఠాలు హల్‌చల్ చేస్తున్నాయి. సాగర తీరం సైబర్ క్రైంకు అడ్డాగా మారుతోంది. విశాఖ యువత వలపు వలలో చిక్కుకుపోతున్నారు. ఎక్స్ కార్ట్ సైట్స్‌లో అందమైన అమ్మాయిల చిత్రాలను పెడుతూ పలకరింపులతో మత్తు విసురుతున్నారు. సైట్ ఓపెన్ చేయగానే చాటింగ్‌తో కథ మొదలవుతుంది. తర్వాత ఎక్సిపీరియన్స్ కావాలంటే ఫలానా అడ్రస్‌లో కలువమంటూ రిక్వెస్ట్.. దానికి ఆన్సర్ చేయగానే ఓ బాయ్ వచ్చి పికప్ చేసుకుంటాడు అంటూ సమాధానం వస్తుంది.
ఇంకేముంది ఎంజాయ్ చేయడమే అనుకుంటూ వారిని ఫాలో అవుతున్నారు. ఫలానా చోటుకు వెళ్లాలి అంటూ డబ్బులు డిమాండ్ చేస్తారు. డబ్బులు తీసుకుని ఏదోఒక ఏరియాలో దించేసి వెళ్లిపోతారు. తర్వాత వారి ఫోన్లు పని చేయవు.. అడ్రస్‌లు కనిపించవు. మరికొందరు ఫేక్ అకౌంట్‌లో ఫొటోలు పెట్టి పరిచయాలు పెంచుకుంటారు. తీరా ఫొటోలను పోర్న్ వెబ్‌సైట్స్‌లో అప్‌లోడ్ చేసి వాటితో బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. తీరా చూస్తే డబ్బులు, పరువు రెండూ పోయి బయటకు చెప్పుకోలేక లోలోపల మదనపడుతున్నారు బాధితులు.
విశాఖలో ఇలాంటి నేరాలు ఎక్కువైపోతున్నాయి. గత ఏడాది 200 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం జనవరి నుండి ఇప్పటి వరకు 150 కేసులు నమోదయ్యాయి. ఎంత అవగాహన కల్పించినా చాలామంది సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడిపోతున్నారని పోలీసులు అంటున్నారు. మొన్నటి వరకు ఆన్‌లైన్ మోసాలను మాత్రమే చూసిన విశాఖ వాసులకు కొత్తగా ఈ ఎక్స్ కార్ట్ వంటి చీటింగ్ మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఎక్కువగా అంతర్ రాష్ట్ర ముఠాలు ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక్క విశాఖ మాత్రమే కాదు ఇతర ప్రాంతాల నుండి కేసులు పెరుగుతున్నాయి. అయితే ఎక్కువ కేసులు విశాఖలో నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికైనా యువత మేల్కోకపోతే ఈ తరహా నేరాలతో జీవితం నాశనం కావడం ఖాయం. సో వైజాగ్ పబ్లిక్ బీ అలర్ట్.