పదేళ్ల పసి పిల్లని అమానుషంగా చెరిచి.. ఆమె ఏడేళ్ళ తమ్ముడితో కలిపి వాగులోకి తోసి చంపేశారు ఇద్దరు కామాంధులు. ఆ కామందుడిలో ఒకరికి గురువారం సుప్రీం కోర్టు తన సంచలన తీర్పులో మద్రాస్ హైకోర్టు విధించిన రెండు సార్లు ఉరి, రెండు యావజ్జీవ కారాగార శిక్షలను ఖరారు చేసింది. ఈ కేసు పూర్తి వివరాలిలా ఉన్నాయి.
తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్ నగరంలోని రంగేగౌదర్ వీధిలో రంజిత్ బట్టల వ్యాపారం చేస్తుంటారు. ఆయనకు ఇద్దరు పిల్లలు. పాప ముస్కరాన్(10), బాబు రితిక్(7) దగ్గరలోని స్కూల్లో చదువుకుంటున్నారు. 2010 అక్టోబర్ 29న అద్దెవ్యాన్ నడుపుకునే మోహన్ కృష్ణన్, అతని స్నేహితుడు మనోహర్ కలసి ఈ ఇద్దరు పిల్లలను కిడ్నాప్ చేశారు. పోలాచ్చి లోని కొండప్రాంతానికి వీరిని తీసుకువెళ్ళారు. అక్కడ చిన్నారి ముస్కరాన్ పై మోహన్ కృష్ణన్ అత్యాచారం జరిపాడు. అనంతరం పిల్లలిద్దరినీ అక్కడికి దగ్గరలోని ఓ వాగులో పాడేశారు. దీంతో ఇద్దరూ మృతి చెందారు. తమిళనాడులో ఈ సంఘటన అప్పట్లో పెను సంచలనం సృష్టించింది.
అదే సంవత్సరం నవంబర్ నెలలో నిందితులను పోలీసులు విచారణ నిమిత్తం తీసుకువెళుతుండగా పోలీసుల నుంచి తుపాకీలను లాక్కొని వారిపై కాల్పులకు ప్రయత్నించారు. ఈ సమయంలో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో మోహన్ కృష్ణన్ హతమయ్యాడు. మనోహరన్ జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఎస్‌ఐలు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ కేసులో కోవై మహిళా కోర్టు 2012 అక్టోబర్ 28న నిందితుడు మనోహరన్ కు రెండు ఉరిశిక్షలు విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును మద్రాస్ హైకోర్ట్ కూడా 2014 మర్చి 24న నిర్ధారించింది. అయితే మనోహరన్ తరఫు న్యాయవాది ముద్దాయి తరుఫున సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. దీంతో సుప్రీం కోర్టు ఉరి శిక్షపై స్తే విధించింది. ఈ అప్పీలు పై గత నెల 11న విచారణ పూర్తయింది. సుప్రీం కోర్టు తీర్పును వాయిదా వేసింది. తిరిగి గురువారం ఈ కేసు విచారణ జరిగింది. ముద్దాయి మనోహర్ కు మద్రాస్ హైకోర్టు విధించిన శిక్షలు యధాతథంగా అమలు చేయాలని తీర్పు చెప్పింది. అయితే, ముద్దాయి రాష్ట్రపతి క్షమాభిక్ష కోరేందుకు అవకాశం ఉంది. రాష్ట్రపతి క్షమాభిక్ష ఇవ్వకపోతే ఉరి తీస్తారు.