ఒక ప్రమాదం... ఎన్నో అనుమానాలు. ఒక ప్రమాదం మరెన్నో కారణాలు. అసలేం జరిగింది? ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది? ఎక్కడ జరిగింది? ఇవే అనుమానాలు అనుకుంటే వాస్తవ విషయాలు ఇంకా ఏమైనా ఉన్నాయా? కరీంనగర్ జిల్లా అలగనూరులో జరిగిన కారు ప్రమాదంలో ఒక్కొక్కటిగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయ్. ఈ కారు ప్రమాదంలో చనిపోయింది పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరి కుటుంబంగా గుర్తించిన పోలీసులకు సవాలక్ష సవాళ్లు ఎదరవుతున్నాయ్. కరీంనగర్ శివారు కాకతీయ కెనాలో పడ్డ కారులో 20 రోజులుగా కుళ్లిపోయిన మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు. చనిపోయింది ఎమ్మెల్యే సోదరి రాధా, ఆమె భర్త సత్యనారాయణరెడ్డి, మేనకోడలు వినయశ్రీ.
ఒకటి కాదు రెండు కాదు. 20 రోజులు. అవును మూడు వారాలకుపైగానే. రోజూ చూసే మనిషే అయినా మనకు ఎలాంటి చుట్టరికం లేని వాడైనా ఒక మనిషి కనిపించకుంటేనే అయ్యో ఏమైపోయాడని ఆరా తీస్తాం. ఇన్నాళ్లు ఎక్కడికి వెళ్లి ఉంటాడని అనుమానిస్తాం. అలాంటిది ఒక కుటుంబం మాయమైతే. ఒక కుటుంబం 20 రోజులుగా కనిపించకపోతే. ఏమనుకోవాలి. ఎవరిని అడగాలి. అందులో ఒక ఎమ్మెల్యే సోదరి కుటుంబం. ఎరువుల వ్యాపారం చేసే సత్యనారాయణరెడ్డి, గుమాస్తాకు అప్పగించి భార్య రాధ, కూతురు వినయశ్రీతో కలసి విహారయాత్రకని బయల్దేరారు. కానీ తిరిగిరాలేదు.
ఏమయ్యారు.? ఏమై ఉంటారు.? ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ముగ్గురు. సత్యనారాయణరెడ్డి ఫ్యామిలీ ఎక్కడికిపోయింది? ఎవరికి పట్టింపులేదు? ఎవరూ పట్టించుకోలేదు? ఎందుకు పట్టించుకోలేదు.? కాలనీవాసులు కలగచేసుకోలేదు. తన దుకాణంలో పనిచేస్తున్న గుమాస్తా కూడా గుట్టుగానే ఉన్నారు. సత్యనారాయణరెడ్డి భార్య రాధా ఒక స్కూల్ టీచర్ అయినా ఆమె కనిపించకున్నా స్కూల్‌కు రాకున్నా ఆమె సహోద్యోగులు కూడా స్పందించలేదు. ఎందుకు? ఏమై ఉంటుంది? సత్యనారాయణరెడ్డి కుటుంబం ఎవరితో టచ్‌లో ఉండదా. ఎవరిని టచ్‌లో పెట్టుకోదా.? బంధువులు భారంగానే చూస్తున్నారా.? చుట్టుపక్కల వాళ్లు కూడా చిన్నచూపే చూస్తున్నారా? 20 రోజుల నుంచి పోలీసులకు ఎవరూ, ఎందుకు ఫిర్యాదు చేయలేకపోయారు.
దీని వెనుక ఒక కారణముందేమో అన్న అనుమానాలు ఉన్నాయ్. సత్యనారాయణరెడ్డి కుమారుడు కొన్నేళ్ల కింద కన్నుమూశాడు. ఆడుతూ పాడుతూ తిరుగుతున్న కుర్రాడు అకస్మాత్తుగా మాయమైపోయాడు. అప్పటి నుంచి ఈ ఫ్యామిలీ అందరితో దూరం దూరంగా ఉంటుందని తెలుస్తోంది. కనీసం కన్న తండ్రితో కూడా మాట్లాడక రెండేళ్లయిందని ఆయనే స్వయంగా చెప్పడం మరీ విషాదం. కొడుకు దూరమైనప్పటి నుంచి అందరిని దూరం పెడుతూ, బంధాలు, బాంధవ్యాల మీద నమ్మకం కోల్పోతూ వాళ్ల బతుకు వాళ్లే బతుకుతున్నారని ప్రచారం ఉంది. ఏమైనా ఇది నిజంగా అతిపెద్ద విషాదం. ఎవరి జీవితంలో కూడా జరగకూడని దారుణం.
20 రోజులు.. 20 అనుమానాలు..
ఆ రోజు ఎప్పుడు బయటకు వెళ్లారు?
బయటకు వెళ్లే ముందుకు ఎవరి చెప్పారు?
సత్యనారాయణరెడ్డి కుటుంబం విహార యాత్రకనే బయల్దేరిందా?
ఒకవేళ అదే నిజమైతే..
చివరి ఫోన్ కాల్ ఎవరికి, ఎప్పుడు చేశారు?
సత్యనారాయణ కుటుంబం విహారయాత్రకే వెళ్తే..
షాప్ బాధ్యతలు ఎవరికి అప్పగించారు?
ఫోన్లు స్విచ్ఛాఫ్ అయినా..
బంధువులు ఎందుకు అనుమానం రాలేదు?
అదృశ్యమై 20 రోజులైనా పోలీసులకు..
ఎవరు, ఎందుకు ఫిర్యాదు చేయలేదు?
కాలనీవాసులు ఆరా తీయడానికి ప్రయత్నించలేదా?
సొంత సోదరి అయినా, ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి సీరియస్‌గా తీసుకోలేదా?
పోలీసులు లేకుండానే ఇంటి తాళాలు ఎందుకు పగలగొట్టారు?
తాళాలు పగలగొట్టాక అయినా పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు?
సత్యనారాయణ మరణం వెనుక ఆర్థిక కోణాలేమైనా ఉన్నాయా?
ఎమ్మెల్యే కుటుంబానికి, సత్యనారాయణరెడ్డి కుటుంబానికి ఏమైనా గొడవలున్నాయా?
మూడు నెలల ముందే సత్యనారాయణరెడ్డి కుమారుడి మరణం వెనుక కారణాలేంటి?
సత్యనారాయణ కుటుంబంపై కావాలనే ఎవరైనా కక్ష పెంచుకున్నారా?
ఆస్తి తగదాల కోణంలో దీన్ని చూడాల్సి వస్తుందా?
స్కూల్ టీచర్ అయిన రాధ సెలవులో ఉంటే సహోద్యోగులు ఎందుకు మౌనంగా ఉన్నారు?
సత్యనారాయణరెడ్డి నడుపుతున్న షాప్ విషయంలో ఎవరితోనైనా విబేధాలు ఉన్నాయా?
సత్యనారాయణరెడ్డి కాల్‌డేటా ఆధారంగా డొంక కదులుతుందా?
సత్యనారాయణరెడ్డి కుటుంబ మరణం ప్రమాదమా.. పథకం ప్రకారమా?