ఇదొక వెరైటీ దొంగతనం. ఇలాంటి ఘటనలు చాలా తక్కువగానే చూసి ఉంటారు. ఓ ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తి తల్లి, బిడ్డను బెదిరించి రూ.2.50 లక్షల విలువైన 76 గ్రాముల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లాడు. అయితే తనకు అత్యవసరంగా రూ.లక్ష కావాలని.. ఆ డబ్బు ఇచ్చారంటే మీ నగలు మీ చేతిలో పెట్టి వెళ్తనని బాధితులతో బేరం పెట్టాడు. అయితే బాధితులు మాత్రం మా దగ్గర చిల్లిగవ్వకుడా లేదనడంతో నగలతో జంప్ అయ్యాడు. ఈ ఘటన ఈనెల 6తేదిన తెల్లవారుజామున నెల్లూరు.. బాలాజీనగర్ రాంజీనగర్‌లో చోటుచేసుకుంది. కాగా పోలీసులు తెలిపిన మేరకు.. కోటకు చెందిన పి.వెంకటకృష్ణారెడ్డి, శ్రీలత దంపతులు. వెంకటకృష్ణారెడ్డి బియ్యం వ్యాపారి.
అయితే గత ఆరు నెలల కిందట కుమార్తె అన్వేషకి పెళ్లి నిమిత్తం రాంజీనగర్‌కు వచ్చారు. ఇక కూతురు పెళ్లితరువాత వెంకట కృష్ణారెడ్డి కోటకు వెళ్లారు. కూతురు ఆషాఢ మాసం కావడంతో తల్లితో కలిసి రాంజీనగర్ కి వచ్చి ఉంటుంది. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున ఓ గుర్తుతెలియని దుండగుడు కిటికీ నుంచి కర్ర సాయంతో ఇంటి తలుపు గడియ తీసుకొని లోపలికి చోరబడ్డాడు. ఇంట్లోకి ఎంటర్ కాగానే కప్‌బోర్డును తెరచి చూసాడు.. అయితే అందులో నయపైస కూడా లేకపోవడంతో అటు ఇటు చూసాడు. ఎక్కడ కూడా ఏం కనిపించలేదు... దీంతో పడక గదిలో నిద్రిస్తున్న శ్రీలత, ఆమె కుమార్తెను నిద్రలేపాడు.
మీ దగ్గర ఉన్న బంగారు ఆభరణాలు ఎక్కడ ఉన్న తీసి నా చేతిలో పెట్టాలని లేని యడల మిమ్మల్ని ఇద్దర్ని చంపుతామని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో దిక్కుతోచన పరిస్థితిలో శ్రీలత పడక దిండుకింద దాచిన మూడున్నర సవర్ల బంగారు గొలుసు, ఆమె కుమార్తె మెడలోని 6 సవర్ల బంగారు గొలుసును లాక్కున్నాడు. అయితే ఈ ఘటనలో నిందితుడు బాధితులకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. నిజానికి తన వద్ద డబ్బులు లేవని వ్యక్తిగత అవసరాల రిత్య వెంటనే రూ.లక్ష అవసరమని, నాకు కావాల్సిన డబ్బును మీరు ఇచ్చినట్లైయితే మీ ఆభరణాలను మీ చేతిలో పెడతానని దొంగ మంచి ఆఫర్ ఇచ్చాడు. కానీ ఇప్పుడికిప్పుడు తమ దగ్గర చిల్లిగవ్వకుడా లేదని చెప్పడంతో ఆభరణాలతో అక్కడి నుంచి దొంగ పరారయ్యాడు. బాధితులు బాలాజీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు దొంగకోసం గాలింపు చర్యలు చేపట్టారు.