సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సతీశ్ హత్య కేసులో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. పక్కా పథకం ప్రకారమే హేమంత్, సతీశ్‌ను మర్డర్ చేసినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. చిన్నప్పటి నుంచి స్నేహితులుగా ఉన్న సతీశ్, హేమంత్ మధ్య హత్య చేసేంత కసి ఎందుకొచ్చింది..? ఈ ఇద్దరి మధ్యలోకి వచ్చిన లేడీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రియాంక ఎవరు..? ఈ ట్రయాంగిల్ స్టోరీ కాస్తా.. క్రైమ్‌గా ఎందుకు మారింది..?
కూకట్‌పల్లి హౌజింగ్ బోర్డ్ సెవెన్త్ ఫేజ్‌లో నివాసం ఉంటున్న సతీశ్ హత్య ఐటీ సెక్టార్‌లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నెల 27 న అర్ధరాత్రి తన స్నేహితుని చేతిలోనే అతికిరాతకంగా హత్య చేయబడ్డాడు. ఆనాడు సతీశ్ హేమంత్ ఇంటికి వెళ్లాడు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మద్యం సేవించిన హేమంత్ పథకం ప్రకారమే సతీశ్‌ను మర్డర్ చేశాడు. ఈ నెల 28 న తన భర్త కనిపించడం లేదని సతీశ్ భార్య ప్రశాంతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో ప్రశాంతితో హేమంత్ కూడా ఉన్నాడు.
అయితే చిన్నప్పటి నుంచి స్నేహితులుగా ఉన్న సతీశ్, హేమంత్ మధ్యలోకి ఏడాదిన్నర క్రితం లేడీ టెకీ ప్రియాంక రావడమే ఈ దారుణానికి కారణంగా భావిస్తున్నారు. సతీశ్ ద్వారా పరిచయమైన ప్రియాంకతో సహజీవనం చేస్తున్న హేమంత్ సతీశ్ వ్యవహారశైలిపై అనుమానంతో ఉన్నాడు. ఆ అనుమానంతోనే సతీశ్‌ను హేమంత్ హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మరోవైపు మొదట సతీశ్ కనిపించడం లేదంటూ యాక్టింగ్ చేసిన హేమంత్‌ను చివరకు ఏపీలోని చిలకలూరిపేటలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ క్రైమ్ స్టోరీకి ముఖ్య కారణంగా భావిస్తున్న ప్రియాంకను కూడా పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. అయితే కేసు ఇంకా విచారణ దశలోనే ఉందని పోలీసులు చెబుతున్నారు.