రిమ్స్‌లో ర్యాగింగ్ కలకలం.. గదిలో నిర్భందించి క్రికెట్ బ్యాట్, వికెట్లతో దాడి
శ్రీకాకుళం జిల్లాలో రాగింగ్ కలకలం రేపుతోంది. జిల్లా కేంద్రంలోని రిమ్స్ వైద్యకళాశాలలో సీనియర్, జూనియర్ విద్యార్ధుల మధ్య వివాదం చోటు చేసుకుంది. దీంతో జూనియర్ విద్యార్ధులను సీనియర్‌లు రెండు రోజుల పాటు నిర్భందించి చితకబాదిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రిమ్స్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న నితీష్ కుమార్, అక్షయ్ కుమార్‌లను సీనియర్ విద్యార్ధులు నగేష్, రాహుల్ రెండు రోజుల పాటు ఓ గదిలో నిర్భందించి క్రికెట్ బ్యాట్, వికెట్లతో వాతలు తేలేలా కొట్టారు. దీంతో అక్షయ్, నితీష్‌లు ఈ ఉదంతాన్ని తమ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్ళడంతో వారు కళాశాల ప్రిన్సిపల్‌కి జరిగిన విషయం పై ఫిర్యాదు చేశారు.
దాడిచేసిన విద్యార్థులు రాహుల్, నగేష్‌ల తల్లిదండ్రులను పిలిచి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, మరోసారి జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో ఈ వ్యవహారం సద్దుమణిగిపోయిందనుకున్నారు. కానీ దాడి జరిగిన 4 రోజుల తర్వాత బాధిత విద్యార్థులు శ్రీకాకుళం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో సీనియర్‌ల పై ఫిర్యాదు చేశారు. నితీష్, అక్షయ్‌ల ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన రాహుల్, నగేష్‌లను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించిన పోలీసులు విచారణ జరిపారు. విచారణలో ఘటనకు గల కారణాలను తెలుసుకున్న పోలీసులు సీనియర్ల చేతిలో దెబ్బలు తినడం వాస్తమేనని తేలింది.