తల్లిని చంపిన కేసులో కూతురు కీర్తి, ఆమె ప్రియుడు శశిని అరెస్ట్ చేసినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. నిందితులు కీర్తి, శశిని మీడియా ముందు ప్రవేశపెట్టిన సీపీ భగవత్ కేసు వివరాలను వెల్లడించారు. పక్కా ప్లాన్ ప్రకారమే కీర్తి, శశి కలిసి రజితను గొంతునులిమి చంపేశారని అన్నారు. గతంలోనూ ఒకసారి నిద్రమాత్రలిచ్చి తల్లి రజితను చంపేందుకు కీర్తి ప్రయత్నించినట్లు తమ విచారణలో తేలిందన్నారు.
ఫ్రెండ్ షిప్ పేరుతో బాయ్ ఫ్రెండ్ రేప్ చేయడంతో కీర్తి గర్భం దాల్చిందని, దాంతో మరో స్నేహితుడు శశి సాయంతో అబార్షన్ చేయించడంతో అతను కూడా కీర్తిని లొంగదీసుకున్నాడని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. కీర్తిని పూర్తిగా తన వశంలోకి తెచ్చుకున్న శశి ఆమె ఆస్తిపై కన్నేసి రజిత మర్డర్‌కు ప్లాన్ చేశాడని వివరించారు. ఇద్దరూ కలిసి రజితను చంపేసి మృతదేహాన్ని రామన్నపేట దగ్గర రైల్వేట్రాక్‌పై పడేశారని సీపీ తెలిపారు. దృశ్యం సినిమా సీక్వెల్‌ను తలపించేలా రజిత మర్డర్ జరిగిందన్నారు మహేశ్ భగవత్.
రజిత మర్డర్ ఘటనలో మొత్తం నాలుగు కేసులు నమోదు చేసినట్లు సీపీ ప్రకటించారు. కీర్తి ప్రియుడు బాల్ రెడ్డిపై 376 బై 2 అండ్ N, 312, సెక్షన్ 5 అండ్ 6 ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే శశి, కీర్తిపై 302, 201, 203, రెడ్ విత్ 34 కింద మరో కేసు నమోదు చేశారు.
శశితో పెళ్లికి రజిత ఒప్పుకోకపోవడంతోనే ఈ హత్య చేశారని పోలీసులు తేల్చారు. అయితే, హత్య తర్వాత తప్పించుకునేందుకు కీర్తిరెడ్డి ప్రయత్నించిందని సీపీ తెలిపారు. తన తల్లిలాగా గొంతు మార్చి బాల్‌రెడ్డికి ఫోన్ చేసిన కీర్తిరెడ్డి తాను వైజాగ్ వెళ్తున్నట్లు నమ్మించింది. కీర్తి ఇంట్లో ఉంటుందని చూసుకోవాలని చెప్పి బాల్‌రెడ్డిని ఇరికించేందుకు ప్లాన్ చేసిందని అన్నారు.
ఇక, కీర్తితో సన్నిహితంగా ఉన్నప్పుడు ఫొటోలు, వీడియోలు తీసుకున్న శశి వాటిని చూపించి బ్లాక్ మెయిల్ చేసేవాడని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు. అందుకే శశి చెప్పినట్లు కీర్తి నడుచుకునేదని, అలా శశికి భయపడే తల్లి రజితను హత్య చేసిందని సీపీ తెలిపారు. ఇక రజిత మృతదేహాన్ని తరలించేటప్పుడు కీర్తికి శశి మద్యం తాగించాడని, అలా కీర్తి శశి చెప్పు చేతల్లోకి వెళ్లి అతను చెప్పినట్లు ఆడేదని అన్నారు.