నిజామాబాద్‌లో వరుస చోరీలను పోలీస్ శాఖ సీరియస్‌గా తీసుకుంది. నెల వ్యవధిలో 30పైగా చోరీలు జరగడంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ బాలానగర్ శివారులో దుకాణాల్లో షట్టర్లు ధ్వంసం చేసి చోరీకి పాల్పడిన ముఠానే నిజామాబాద్‌లో షట్టర్లు ధ్వంసం చేసి చోరీకి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.
బంగారు దుకాణాల్లో చోరీలకు పాల్పడిన ముఠా కోసం 4ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. అపహరించిన టాటా సుమోలో వచ్చిన దొంగలు డీజిల్ అయిపోవడంతో నవీపేట మండలం అభంగపట్నం వద్ద వదిలి వెళ్లారు. అదే ప్రాంతంలో రెండు మోటార్ సైకిళ్లు చోరీకి గురయ్యాయి. దొంగలు వదిలి వెళ్లిన సుమోలో గడ్డపార, గ్లౌజులు, వెండిపూత పూసిన టిఫిన్ బాక్స్, ఒక జత బంగారు కమ్మలు, మరో చెవి కమ్మ లభించాయి.