సినిమాల్లో అవకాశం ఇప్పిస్తాం అంటూ కొంత మంది అమాయక జనాలను నమ్మించి వారి దగ్గర నుంచి డబ్బులు గుంజి మోసం చేసిన సంఘటనలు అప్పుడప్పుడూ వెలుగులోకి వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఇదే తరహా సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నంకు చెందిన ఓ యువతి సినిమాలపై మక్కువతో జూనియర్ ఆర్టిస్టుగా అవకాశాల కోసం అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయాన్ని గమనించిన స్థానిక గీతాలయ స్టూడియోస్‌కు చెందిన గీతా ప్రసాద్ మరికొంత మందితో కలిసి ఆ యువతికి సినిమాల్లో అవకాశం ఇప్పిస్తామంటూ టోకరా వేసారు. ఆ యువతికి మాయమాటలు చెప్పి బురిడీ కొట్టించారు. త్వరలోనే ఓ సినిమా షూటింగ్ మొదలవబోతుందని, ఆ సినిమా వ్యక్తులు తనకు తెలుసునని ఆ యువతిని నమ్మబలికారు.
ఆ సినిమాలో స్పెషల్ సాంగ్స్ లో డ్యాన్స్ చేసే అవకాశం ఇప్పిస్తానని నమ్మించారు. అంతే కాదు ఒక్కో సాంగ్ కు పది లక్షల రూపాయల రెన్యూమరేషన్ ఇప్పిస్తానని చెప్పిన గీతాప్రసాద్ అండ్ గ్యాంగ్ ఇందుకుగాను తనకు రూ. 5 లక్షల కమీషన్ ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ప్రొడ్యూసర్ ఇచ్చే డబ్బుల్లో ఐదు లక్షలు తనకు కమిషన్ గా ఇవ్వాలని యువతితో బేరం ఆడాడు. అంతకంటే ముందు బడ్జెట్ సరిపోలేదని, సినిమా ఆగినందున డబ్బు సర్దాలని యువతికి అడిగారు. వారి మాయ మాటలను నమ్మిన యువతి రెండు దఫాలుగా ఆస్తి తనఖా పెట్టి ఐదు లక్షల రూపాయలను గీతా ప్రసాద్ కు ముట్టజెప్పింది. సినిమా షూటింగ్ ఎప్పటికీ జరగకపోవడంతో తన డబ్బు తనకు ఇవ్వాలని ఆ యువతి సదరు వ్యక్తులు నిలదీసింది. దీంతో గీతాప్రసాద్ డబ్బులు ఓ హోటల్ వ్యక్తి ఇస్తాడంటు ప్రముఖ హోటల్ కి ఆమెను పంపించాడు. అది నమ్మిన యువతి అక్కడికి చేరుకున్నాక అక్కడ వ్యభిచారం చేయ్యాలని మరో వ్యక్తి ఒత్తిడి చేసారు.
దీంతో ఆ యువతి తాను ఇచ్చిన డబ్బులు అడుగుతుంటే దౌర్జన్యం చేస్తున్నారని, తనకు ప్రాణ హాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించింది. కొంత మంది వ్యక్తులు ప్రముఖ రాజకీయ నాయకుల పేర్ల చేప్పి అమాయక యువతులు కు గాలం వేస్తున్నారని తెలిపింది. తనలాగే ఇప్పటివరకు మరో పది మంది యువతలను గీతా ప్రసాద్ మోసం చేసాడని ఆరోపించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న వెస్ట్ ఏసీపీ స్వరూపా రాణి దర్యాప్తు చేస్తున్నారు. గీత ప్రసాద్ గ్యాంగ్ పై పలు కేసులు నమోదు చేసారు.