యువతి సజీవ దహనం కేసు.. 16 మందికి మరణశిక్ష

Update: 2019-10-25 07:31 GMT

ఓ యువతిని సజీవ దహనం చేసిన కేసులో 16 మంది నిందితులను దోషులుగా తేల్చిన బంగ్లాదేశ్ కోర్టు వారందరికీ మరణశిక్షను విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది. వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్ లోని సోనాగాజీ ఇస్లామియా ఫాజిల్ మదరసాలో 18 ఏళ్ల యువతి నుస్రత్‌ ను కోరిక తీర్చమని మదరసా ప్రిన్సిపాల్ సిరాజుద్దౌలా కోరాడు. దీంతో ఆమె నిరాకరించి ప్రిన్సిపాల్ పై కేసు పెట్టింది. తనపై కేసు పెట్టిందనే కోపంతో ప్రిన్సిపాల్ సిరాజుద్ధౌలా 16 మంది ఇతరులతో కలిసి సజీవంగా దహనం చేశారు. ఈ దారుణ ఘటన ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జరిగింది. శరీరం కాలిన బాలిక ఢాకా మెడికల్ కళాశాలలో చికిత్స పొందుతూ నాలుగురోజులకు మరణించింది.

నుస్రత్‌ మృతిపై దేశ రాజధాని ఢాకాలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. నుస్రత్‌ మృతికి కారణమైనవారిని కఠినంగా శిక్షించాలని నిరసనకారులు డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై స్పందించిన బంగ్లా ప్రధాని షేక్‌ హసీనా బాధ్యులను తప్పకుండా శిక్షించి తీరుతామని హామీ ఇచ్చారు. నుస్రత్ కేసును నీరుగార్చే ప్రయత్నం కూడా జరిగింది. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. నుస్రత్ కేసును విచారించేందుకు ఏర్పాటైన ఫాస్ట్‌ట్రాక్ కోర్టు త్వరితగతిన విచారణ పూర్తిచేసింది. గురువారం తుది తీర్పు ప్రకటించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న 16 మంది నిందితులను దోషులుగా ప్రకటించిన కోర్టు వారికి మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. కోర్టు తీర్పుపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News