హైదరాబాద్ కూకట్‌పల్లిలో తీవ్ర సంచలనం సృష్టించిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సతీష్ హత్య కేసులో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. సతీష్ హత్యకు గురైన రోజు ప్రియాంకను హాస్టల్ దగ్గర డ్రాప్ చేసిన విజువల్స్ బయటికొచ్చాయి. అయితే, ప్రియాంకను హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి ఇంటికి వస్తానని సతీష్ తన భార్యకు మెసేజ్ చేశాడు. ఆ తర్వాతే సతీష్ మర్డర్ కు గురైనట్లు తెలుస్తోంది.
అయితే, తన భర్త హత్యకు వివాహేతర సంబంధం కారణం కాదని సతీష్ భార్య ప్రశాంతి అంటున్నారు. ఆర్ధిక లావాదేవీలతోనే తన భర్త మర్డర్‌కు కారణమని ఆరోపించారు. ప్రధాన నిందితుడు హేమంత్‌తోపాటు సతీష్ ఇంకా మరికొంమంది వ్యాపార భాగస్వామ్యులుగా ఉన్నారని వాళ్లందరినీ విచారించాలని ప్రశాంతి డిమాండ్ చేస్తున్నారు. తన భర్త హత్యను వివాహేతర సంబంధంతో ముడిపెట్టి కేసును మూసివేయాలని చూస్తున్నారని ప్రశాంతి ఆవేదన వ్యక్తం చేసింది. హేమంత్ కాల్ డేటాను పరిశీలిస్తే ఈ హత్యలో ఇంకా ఎవరెవరు ఉన్నారో తెలుస్తుందని అన్నారు.
ఇదిలా ఉంటే, సతీష్ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు హేమంత్‌ను గుల్బర్గాలో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, సతీష్ హత్యకు ఆర్ధిక లావాదేవీలతోపాటు వివాహేతర సంబంధమే కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. తన స్నేహితురాలు ప్రియాంకతో సతీష్ చనువుగా ఉండటాన్ని తట్టుకోలేకే హేమంత్ ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే, ప్రియాంకతో సతీష్‌కు వివాహేతర సంబంధమున్నట్లుగా పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. అయితే, సతీష్ కుటుంబ సభ్యులు మాత్రం ఆర్ధిక లావాదేవీలతోనే మర్డర్ జరిగిందని ఆరోపిస్తున్నారు. హత్య జరిగిన రోజు హేమంత్ ఇంటికి సతీష్ వెళ్లాడని, అక్కడ ఇద్దరూ కలిసి మద్యం సేవించారని పోలీసులు గుర్తించారు. అలాగే, హత్య జరిగిన రోజు ప్రియాంకను సతీష్ హాస్టల్ దగ్గర డ్రాప్ చేసిన విజువల్స్‌ను పోలీసులు సేకరించారు.